చిరంజీవికే షాక్‌ ఇచ్చిన జనం

చిరంజీవికే షాక్‌ ఇచ్చిన జనం

చిరంజీవి సినిమాకి ఓపెనింగ్‌ బాగుంటుందని అభిమానులు ఊహించి వుండొచ్చు కానీ ఈ స్థాయిలో బాక్సాఫీస్‌ని షేక్‌ చేసేసే ఓపెనింగ్‌ వస్తుందని వారు కూడా కలగని వుండరు. ఈ స్థాయి స్వాగతం లభిస్తుందని, తన 150వ చిత్రానికి ఇంత బజ్‌ వస్తుందని తాను కూడా ఊహించలేదని చిరంజీవి సైతం అంగీకరిస్తున్నారు.

చిరంజీవి మాటల్లో నిజముందని ఒప్పుకోవాలి. ఎందుకంటే ఇలాంటి వెల్‌కమ్‌ ఊహించినట్టయితే ఖచ్చితంగా 'కత్తి' రీమేక్‌తో సేఫ్‌ గేమ్‌ ఆడాలని చూసి వుండేవారు కాదు. స్ట్రెయిట్‌ సినిమాకి వుండే క్రేజ్‌ ఎప్పటికీ రీమేక్‌ చిత్రానికి రాదు. ఈ సంగతి తెలిసినప్పటికీ ఎటుపోయి ఎటు వచ్చినా సేఫ్‌ సైడ్‌ వుండడానికి చిరంజీవి క్యాంప్‌ మొగ్గు చూపింది.

పూర్తి కమర్షియల్‌ హంగులతో వున్న చిత్రం చేయడానికే చిరంజీవి ఇష్టపడ్డారు తప్ప కాస్తయినా వైవిధ్యం జోలికి పోలేదు. ఇన్నేళ్ల తర్వాత తిరిగొస్తున్నందుకు, రాజకీయ రంగంలో విఫలమైనందుకు, వ్యక్తిగత ఇమేజ్‌ కొంత డ్యామేజ్‌ అయినందుకు చిరంజీవి ధైర్యం చేయలేకపోయారు. కానీ రాజకీయాలు వేరు, సినిమాలు వేరని జనం ఈ చిత్రానికి ఇచ్చిన ఓపెనింగ్‌తోనే తేటతెల్లం చేశారు.

సినిమాల వరకు చిరంజీవిని తాము ఎంత ఆరాధిస్తామని ఈ కలక్షన్లతో చూపించారు. ఈ చిత్రం ఏ రేంజ్‌కి చేరుతుంది, ఎంత వసూలు చేస్తుందనేది సెకండరీ. చిరంజీవి అంటే జనంలో మునుపటి అభిమానం వుందా లేదా అనే ప్రశ్నకి ఇది సమాధానమిచ్చింది. ఇక ఇక్కడ్నుంచి కథల పరంగా ఎక్స్‌పెరిమెంట్‌ చేయడం, ఏజ్‌కి అనుగుణంగా సినిమాలు చేస్తూ తన ప్రస్థానం కొనసాగించడం చిరు చేతుల్లోనే వుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు