ఎక్కడ చూసినా వాళ్లిద్దరి దర్శనమే..!

 ఎక్కడ చూసినా వాళ్లిద్దరి దర్శనమే..!

తెలిసిన తర్వాత దాచుకుని ప్రయోజనం లేదనుకుంటున్నారు నాగచైతన్య-సమంత జోడీ. ఈ ఇద్దరి మధ్య ప్రేమ ఉందనే విషయం అందరికీ తెలిసిపోయింది. కానీ ఈ ఇద్దరూ మాత్రం నోరు విప్పి ఎప్పుడూ తమ ప్రేమ విషయం చెప్పలేదు. కానీ చేతలతో మాత్రం చెప్పేస్తున్నారు తామిద్దరం ఒక్కటేనని. వీళ్లు ఏం చేసినా ఇప్పుడు టాలీవుడ్‌ లో సంచలనం అయిపోయింది. వీళ్ల పేర్లు పక్కపక్కన వినిపించాయంటే చాలు.. ఇప్పుడు లేనిపోని అనుమానాలన్నీ వచ్చేస్తున్నాయి ప్రేక్షకుల్లో. దానికి వాళ్లు చేస్తోన్న పనులే నిదర్శనం. ఆ మధ్య కొన్ని రోజులు దాగుడు మూతలు ఆడిన చైతూ, సమంత.. ఇప్పుడు అందరికీ తెలిసేలా తమ బంధాన్ని తెలియజేస్తున్నారు. ఎక్కడ చూసినా ఇప్పుడు చైతూ, సమంతలే కలిసి దర్శనమిస్తున్నారు. ఆ మధ్య థియేటర్‌ లో కలిసి అ..ఆ సినిమా చూసిన ఈ జంట.. మొన్న ఓ బాల్కనీ టాప్‌ లో కలిసి కనిపించారు. అంతకు ముందు షాపింగ్‌ మాల్‌ లో.. ఇప్పుడు ఓ రెస్టారెంట్‌ లో భోజనం చేసి బయటికి వస్తున్నారు.


ముందు విడుదలైన ఫోటోల్లో సమంత, చైతూ కాస్త క్లారిటీగా కనిపించలేదు. కానీ ఇప్పుడు రెస్టారెంట్‌ ఫోటోలో మాత్రం చాలా చక్కగా దర్శనం ఇచ్చేస్తున్నారు. చైతూ ప్రేమమ్‌ పాటల చిత్రీకరణ కోసం నార్వే వెళ్లనున్నాడు. ఇక సమంత కూడా జనతా గ్యారేజ్‌ షూటింగ్‌ లో పాల్గొననుంది. ఆలోపే ఈ ఇద్దరూ విరహవేదన తాళలేకపోతున్నారు. ఈ మధ్య నాగచైతన్య, సమంత పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే నాగచైతన్య వాళ్ల అమ్మ కూడా ఈ పెళ్ళికి ఓకే చెప్పింది. నాగార్జున సైతం చైతూ, సమంత పెళ్లికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేసాడు. ఇంట్లో నుంచి పచ్చజెండా వచ్చినందుకే చైతన్య, సమంత తమ బంధాన్ని ప్రపంచానికి తెలియచేస్తున్నారనే వార్తలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. అంతేలెండి.. ముసుగులో గుద్దులాట కంటే వెలుగులో అందరికీ తెలిసేలా తిరగడమే నయం అనుకుంటున్నారు ఈ జంట. మరి వీళ్ల పెళ్లి భాజాలు ఎప్పుడు మోగనున్నాయో..

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు