ఈసారైనా మామా అల్లుళ్ల ఫార్ములా మారుస్తారా?

టాలీవుడ్లో మోస్ట్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్-రైటర్ డ్యుయోల్లో త్రినాథరావు నక్కిన-ప్రసన్నకుమార్ బెజవాడలది ఒకటి. సినిమా చూపిస్త మావ అనే చిన్న సినిమాతో వీళ్లిద్దరి ప్రయాణం మొదలైంది. ఆ సినిమా సూపర్ హిట్టయి వీళ్లకు మంచి డిమాండ్ తెచ్చిపెట్టింది. ఆ తర్వాత నేచురల్ స్టార్ నాని హీరోగా ఇదే జోడీ ‘నేను లోకల్’ చేస్తే అది ఇంకా పెద్ద బ్లాక్ బస్టర్ అయింది.

ఆ తర్వాత ప్రసన్నకుమార్ స్క్రిప్టుతో త్రినాథరావు.. రామ్ హీరోగా ‘హలో గురూ ప్రేమ కోసమే’ చేశాడు. అది కూడా మంచి విజయం సాధించింది. చాలామంది గుర్తించని విషయం ఏంటంటే.. ఈ మూడు చిత్రాల్లోనూ కథలో సారూప్యతలుంటాయి. హీరో.. హీరోయిన్‌తో ప్రేమలో పడితే ఆమె తండ్రి అడ్డుపడడం.. మామా అల్లుళ్ల మధ్య పోరు నడవడం.. చివరికి మామ మీద అల్లుడు గెలవడం కామన్ పాయింట్.

ఒకే కథను మూడుసార్లు అటు ఇటు తిప్పి తీసినా ప్రేక్షకులకు బోర్ అనిపించలేదు. మంచి ఎంరట్టైన్మెంట్ ఉండడంతో అన్నింటికీ విజయాలు కట్టబెట్టారు. ఇప్పుడు ఇదే జోడీ నుంచి మరో సినిమా రాబోతోంది. సందీప్ కిషన్ అందులో హీరో కాగా.. రావు రమేష్ కీలక పాత్ర చేస్తున్నాడు. మధ్యలో త్రినాథరావు-ప్రసన్నకుమార్ ‘ధమాకా’తోనూ ఘనవిజయాన్నందుకున్నారు.

కాకపోతే రవితేజ ఇమేజ్ వేరు కాబట్టి మామా అల్లుళ్ల ఫార్ములా పక్కన పెట్టి ఆయన కోసం వేరే కథ ట్రై చేశారు. అది వర్కవుటైంది. కానీ సందీప్ హీరో.. రావు రమేష్ కీలక పాత్ర అనగానే మళ్లీ పాత ఫార్ములాను బయటికి తీస్తారేమో అన్న సందేహాలు కలుగుతున్నాయి. రావు రమేష్ పాత్ర సినిమాలో కీలకమని.. అది చాలా ఎంటర్టైనింగ్‌గా ఉంటుందని అంటున్నారు. ఐతే ఒకే కథను అటు ఇటు తిప్పి తీస్తే అన్నిసార్లూ వర్కవుట్ కాదు కాబట్టి ఈసారి త్రినాథరావు-ప్రసన్నకుమార్ కొత్త ఫార్ములా ట్రై చేస్తారేమో చూడాలి.