మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ మధ్య అనుబంధం గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇద్దరూ సోదరులే కానీ.. పవన్ మీద చిరు పుత్ర వాత్సల్యం చూపిస్తారు. పవనేమో చిరును తండ్రిలా గౌరవిస్తాడు. అన్నయ్య వల్లే సినీ రంగంలోకి వచ్చానని.. ఆయన వల్లే ఒక స్థాయికి ఎదిగానని పవన్ ఎన్నో సందర్భాల్లో చెప్పాడు.
ప్రజారాజ్యం పార్టీకి తెరపడ్డాక కొన్నేళ్లు చిరుకు కొంచెం దూరంగా అన్నట్లు కనిపించాడు తప్పితే పవన్ ఎప్పుడూ చిరుకు దగ్గరే. ఆయనంటే అవాజ్యమైన ప్రేమ, గౌరవ భావం పవన్ లో కనిపిస్తాయి. ఇప్పుడు తన అన్నయ్య మీద ప్రేమను అనుకోకుండా బయట పెట్టాడు పవన్. తాజాగా జరిగిన కేబినెట్ సమావేశంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నేరుగా పాల్గొనలేక పోయారు. ఈ మీటింగ్ కు ఆయన వర్చువల్ గా హాజరయ్యారు.
ఈ సందర్భంగా వీడియో కాల్ లో పవన్ ను చూసిన వారిని ఆయన వెనుక ఉన్న ఫోటో ఆకర్షించింది. 2024 ఎన్నికల్లో గెలిచి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సందర్భంగా పవన్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినపుడు స్టేజ్ మీద పవన్ ను చూసి చిరు ముచ్చటపడ్డపుడు తీసిన ఫోటో అది. తన జీవితంలో అత్యంత ముఖ్యమైన ఆ మూమెంట్ ను పవన్ ఫోటో తీయించి ఇంట్లో పెట్టుకున్నారు.
ఇదేమీ మరీ ఆశ్చర్యం కలిగించే విషయం కాదు. పవన్ ఇలాంటివి డిస్ప్లే చెయ్యాలని కూడా అనుకోరు. కానీ మెగా అభిమానులకు మాత్రం ఇది పవన్ ఇంట్లో ఈ ఫోటో ఉండడం ముచ్చటగా అనిపించింది. చిరు మీద పవన్ ప్రేమకు ఇది నిదర్శనమని.. ఆయన ఎంత ఎత్తుకు ఎదిగినా తన అన్నయ్య మీద ప్రేమ, గౌరవం తగ్గవు అనడానికి ఇది నిదర్శనమని.. సోదరుల మధ్య బంధం అంటే ఇలా ఉండాలని కామెంట్లు చేస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates