ఇంతకన్నా మంచి ఛాన్స్ రాదు శర్వా

రేపు భోగి విడుదల కానుంది. ప్రమోషన్స్ పరంగా టీమ్ ఎంత చేయాలో అంతా చేసింది. ప్రీ రిలీజ్ ఈవెంట్లు, ఇంటర్వ్యూలు, వైరల్ వీడియోలు ఇలా ఇప్పుడున్న ట్రెండ్ లో జనాలకు రీచ్ అవ్వడానికి అవసరమైన ప్లానింగ్ మొత్తం అమలు పరిచింది. రిలీజ్ డేట్ వాయిదా పడి సెన్సార్ ఆలస్యం వల్ల టైం తక్కువగా దొరకడంతో ఉన్నంతలో పబ్లిసిటీకి లోటు లేకుండా చూసుకున్నారు. అడ్వాన్స్ బుకింగ్స్ నెమ్మదిగా ఉన్నాయి కానీ ఉదయం ఒక షో అయ్యాక అనూహ్యమైన మార్పు ఉంటుందని టీమ్ నమ్ముతోంది.

ఒక రకంగా చెప్పాలంటే శర్వానంద్ కి ఇది గోల్డెన్ ఛాన్స్. ఇలా సోలోగా ఒక మాస్ సినిమాతో ఓపెన్ గ్రౌండ్ దక్కించుకోవడమంటే మాటలు కాదు. ఎందుకంటే పోటీలో ఉండాల్సిన రష్మిక మందన్న మైసా, బెల్లంకొండ సాయిశ్రీనివాస్ హైందవ రెండూ తప్పుకున్నాయి. సో భోగికి సరిపడా థియేటర్లు అందుబాటులో ఉన్నాయి. పాజిటివ్ టాక్ వస్తే మరిన్ని ఇవ్వడానికి డిస్ట్రిబ్యూటర్లు సిద్ధంగా ఉన్నారు. ఆకాశంలో ఒక తార, ఈ నగరానికి ఏమైంది రిపీట్, ఓమ్ కు సరిపడా రెండో వారం స్క్రీన్లు ఆల్రెడీ లాక్ చేసుకుని ఉన్నాయి.

ట్రైలర్ చూశాక భోగిలో కనివిని ఎరుగని కంటెంట్ ఉందని జనాలు ఫీలవ్వలేదు కానీ ప్రాపర్ స్క్రీన్ ప్లే, యాక్షన్ ఎపిసోడ్స్ కనక సరిగ్గా పేలితే మాస్ ఆడియన్స్ అండతో భోగి సూపర్ హిట్ స్టాంప్ వేసుకోవచ్చు. పైకి వయొలెంట్ మూవీలా కనిపిస్తున్నా అసలు సినిమాలో సిస్టర్ సెంటిమెంట్ పుష్కలంగా ఉంటుందని, స్పాయిలర్స్ ఉండకూడదనే ఉద్దేశంతోనే శర్వా అయిదుగురు చెల్లెళ్ళకు సంబంధించిన సీన్స్ ని ఎక్కువగా రివీల్ చేయలేదట. అనుపమ పరమేశ్వరన్ ని దాచింది కూడా అందుకే కాబోలు.

బైకర్ కోసం విపరీతంగా కష్టపడినా ఆశించిన ఫలితం అందుకోలేకపోయిన శర్వానంద్ ఇప్పుడీ భోగికి అంతకన్నా ఎక్కువ ఎఫర్ట్ పెట్టాడు. తన కంఫర్ట్ జోన్ నుంచి బయటికి వచ్చి మాసిపోయిన చొక్కా పంచతో రిస్క్ అనిపించే స్టంట్లు చాలా చేశాడు. పెర్ఫార్మన్స్ పరంగా కూడా దర్శకుడు సంపత్ నంది ఛాలెంజింగ్ అనిపించే సన్నివేశాలు ఇవ్వడం వల్ల ఇదే తన కెరీర్ బెస్ట్ సినిమాగా శర్వా చెప్పుకుంటున్నాడు. భీమ్స్ సంగీతం అందించిన ఈ రా విలేజ్ డ్రామా దశాబ్దాల వెనుకటి బొగ్గులగుట్ట నేపథ్యంతో సాగుతుంది.