గత కొన్నేళ్లుగా మలయాళంలో చాలా థ్రిల్లర్లు వచ్చాయి. వాటిలో కొన్ని అద్భుతం అనిపించగా, మరికొన్ని తలనెప్పి కూడా తెప్పించాయి. అయినా సరే వీటిని తీయడం మల్లువుడ్ మేకర్స్ మానుకోవడం లేదు. తాజాగా జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అఫ్ ఇండియా (ఐఫి)లో మన శంకరవరప్రసాద్ గారు, భక్త కన్నప్ప లాంటి తెలుగు సినిమాల ప్రదర్శన జరిగిన సంగతి తెలిసిందే. ఇవి మనం చూసినవే కానీ హాఫ్ అనే మలయాళ మూవీ గురించి ఆహుతులు తెగ మాట్లాడుకుంటున్నారు.
కేవలం గంటా నలభై నిమిషాలలోపే ఉన్న ఈ రివెంజ్ థ్రిల్లర్ కి సంజాద్ దర్శకత్వం వహించారు. ఇతను గతంలో తీసిన గోళం మంచి విజయం సాధించింది. ఓటిటిలో విపరీతంగా చూశారు. ఇప్పుడీ హాఫ్ కు చిత్రోత్సవాల్లో వస్తున్న స్పందన చూసి తెలుగుతో పాటు ఇతర భాషల్లో డబ్బింగ్ చేసే జనవరిలో విడుదల చేసేందుకు నిర్మాతలు రెడీ అవుతున్నారు. హాఫ్ లో అమలా పాల్, వినీత్ లాంటి మనకు తెలిసిన ఆర్టిస్టులు ఉన్నారు. ఇంతగా జనాల దృష్టిని ఆకర్షించే థ్రిల్లింగ్ కంటెంట్ ఏముందో ఓ లుక్ వేద్దాం.
ఇదో కవల అన్న చెల్లెలి కథ. ఈతన్, ఐవి అనే ట్విన్స్ పగటిపూట మాములు మనుషులు. రాత్రి మాత్రం ఒంట్లో ఉన్న రక్తపిశాచి కణాల వల్ల వ్యాంపైర్స్ గా మారుతూ ఉంటారు. ఓసారి రాజస్థాన్ లో రోడ్డు ప్రయాణం చేస్తుండగా ఒక దొంగల ముఠా దాడి చేసి, చాలా దారుణంగా హింసించి, ఇద్దరూ చనిపోయారని భావించి ఎడారిలో పారేసి పోతారు. చీకటి పడగానే ఈతన్, ఐవి దెబ్బలను పోగొట్టుకుని ఒక్కో దొంగని వెతికి వేటాడి కిరాతకంగా చంపడం మొదలుపెడతారు. వీళ్ళ రక్తం వెనుక ఉన్న రహస్యమే అసలు స్టోరీ.
మొదటి పావు గంట సెటప్ చేయడానికి కొంత టైం తీసుకున్నా ఆ తర్వాత స్క్రీన్ ప్లే పరుగులు పెడుతుంది. ముఖ్యంగా అన్న చెల్లెలు కలిసి దొంగలను వేటాడే క్రమం, దానికన్నా ముందు వీళ్ళ మధ్య జరిగే హింస చాలా డెప్త్ గా చూపించారు. క్లైమాక్స్ ఘటాన్ని మెయిన్ హైలైట్ గా చెప్పుకోవచ్చు. యాక్షన్ ఎపిసోడ్లు చాలా కొత్తగా ఉన్నాయి. ఈ పాయింట్ కు దగ్గరగా అనిపించేలా బాలీవుడ్ లో ఒకప్పుడు జునూన్ వచ్చింది కానీ అంతగా ఆకట్టుకోలేదు. కానీ హాఫ్ మాత్రం టాక్ అఫ్ ది ఆడియన్స్ అయ్యేలా ఉంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates