చంద్ర‌బాబు సంప‌ద సృష్టిలో తొలి అడుగు ప‌డిన‌ట్టేనా..!

సంప‌ద సృష్టి. ఈ మాట ఈ ఏడాది జ‌రిగిన ఎన్నిక‌లకు ముందు జోరుగా వినిపించింది. “సూప‌ర్ సిక్స్ అమ‌లు చేస్తాం అంటే.. కొంత‌మంది .. ఎలా అమ‌లు చేస్తారు? అని ప్ర‌శ్నిస్తున్నారు. మ‌ళ్లీ మ‌ళ్లీ చెబుతున్నాం.. అమ‌లు చేస్తాం. సంప‌ద‌సృష్టిస్తాం.. ఆ సంప‌ద‌ను అంద‌రికీ పంచుతాం. అప్పుడు అన్నీ అమ‌ల‌వుతాయి..” ఇదీ.. ఎన్నిక‌ల స‌మ‌యంలో టీడీపీ నాయ‌కులు చెప్పిన మాట‌. దీంతో సంప‌ద సృష్టిపై త‌ర‌చుగా కూట‌మి స‌ర్కారుకు ప్ర‌శ్న‌లు ఎదుర‌వుతూనే ఉన్నాయి.

అయితే.. ఇప్పుడు ఈ సంప‌ద సృష్టిలో తొలి అడుగు ప‌డిన‌ట్టేనా? అంటే.. టీడీపీ నాయ‌కులు ఔన‌నే అంటున్నారు. దీనికి కార‌ణం.. తాజాగా సోమ‌వారం నుంచి నూతన‌ మ‌ద్యం విధానం అందుబాటులోకి రానుంది. ఈ విధానంతో స‌ర్కారుకు కాసుల వ‌ర్షం కురియ‌నుంద‌ని పార్టీ నాయ‌కులు చెబుతున్నారు. ఇప్ప‌టికే 3,396 మద్యం షాపుల కోసం 89,882 దరఖాస్తులు వచ్చాయి. దీని ద్వారా దరఖాస్తు రుసుముల రూపంలో ఆదాయం 1,798 కోట్ల రూపాయ‌లు సమకూరింది.

సగటున ఒక్కో దుకాణానికి 26 మంది పోటీ పడ్డారు. ఈ నెల 16 నుంచి కొత్త దుకాణాలు ప్రారంభం కానున్నా యి. అయితే.. క‌థ ఇక్క‌డితో అయిపోలేదు. సోమ‌వారం నిర్వ‌హించే లాట‌రీలో అవ‌కాశం ద‌క్కించుకున్న వ్యాపారులు.. అప్ప‌టిక‌ప్పుడు ఆయా ప్రాంతాల వారీగా వ్యాపార లైసెన్సుకు సంబంధించి కోట్ల రూపాయ ల‌ను ప్ర‌భుత్వానికి చెల్లించాలి. అంటే.. ఉదాహ‌ర‌ణ‌కు ఏదైనా కాలేజీలో చేరాల‌ని అనుకుంటే ముందు ద‌ర‌ఖాస్తు కొని అప్ల‌యి చేస్తాం. త‌ర్వాత‌.. సీటు వ‌స్తే..కోర్సుకు ఫీజు చెల్లించిన‌ట్టుగా ఇప్పుడు వ్యాపారులు చెల్లించాలి.

ఈ ధ‌ర‌లు.. ప్రాంతం, జిల్లా, జ‌నాభా, మ‌ద్యం వినియోగం లెక్క‌ల‌ను బ‌ట్టి ఆధార‌ప‌డి ఉంటుంది. ఉదాహ‌ర‌ణ‌కు విశాఖ‌ప‌ట్నం వంటి న‌గ‌రాల్లో 20 వేల మందికి ఒక బార్ ఉంటే.. 10వేల మందికి ఒక వైన్ షాపు ఉంటుంది. ఇక్క‌డ మ‌ద్యం అమ్మ‌కాలు కూడా ఎక్కువ‌గానేఉంటాయి. కాబ‌ట్టి.. లైసెన్సు ఫీజు కింద‌.. ప్ర‌భుత్వానికి 2 నుంచి 5 కోట్ల రూపాయ‌ల వ‌ర‌కు చెల్లించాలి. ఇక‌, విజ‌య‌వాడ‌, అనంత‌పురం, గుంటూరు, రాజ‌మండ్రి వంటి సిటీల్లో మాస్ పీపుల్ ఎక్కువ‌గా ఉంటారు కాబ‌ట్టి.. అక్క‌డ మ‌రో రెండు కోట్లు ఎక్కువ‌గా చెల్లించాలి. ఇలా.. మొత్తంగా ఇలా.. 3,396 దుకాణాలు కోట్ల రూపాయ‌ల్లోనే చెల్లించాలి. సుమారు 3 వేల కోట్ల రూపాయ‌ల వ‌ర‌కు వ‌స్తుందని అంచ‌నా వేస్తున్నారు. సో.. ఇదంతా సంప‌ద సృష్టేన‌ని త‌మ్ముళ్లు ప్ర‌చారం చేస్తున్నారు.