తెలంగాణ పండుగల్లో ఉండే జోష్ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఇక దసరా పండుగ సమయంలో సుక్కా ముక్కా లేదంటే కిక్కు ఉండదనేది కొందరి అభిప్రాయం. ఈసారి మద్యం అమ్మకాలు విపరీతంగా పెరిగాయి. దసరా పండుగ సీజన్లో రాష్ట్రంలో మద్యం విక్రయాలు రూ. 1,100 కోట్లకు పైగా చేరుకున్నాయి. ముఖ్యంగా అక్టోబర్ 10, 11 తేదీల్లో రికార్డు స్థాయిలో అమ్మకాలు జరిగాయి.
11వ తేదీకి ఒక్కరోజే రూ. 200.44 కోట్ల విలువైన మద్యం అమ్ముడవ్వగా, 10వ తేదీన రూ. 152 కోట్లకు పైగా అమ్మకాలు నమోదయినట్లు తెలుస్తోంది. అక్టోబర్ 1 నుంచి 10 వరకు మొత్తం రూ. 852.40 కోట్ల మద్యం విక్రయాలు జరిగినట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు వెల్లడించారు. హైదరాబాద్, రంగారెడ్డి వంటి నగరాల్లో మద్యం విక్రయాలు అత్యధికంగా ఉండగా, కరీంనగర్, నల్లగొండ, వరంగల్ జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున అమ్మకాలు జరిగాయి.
దసరా పండుగ సీజన్ ముందు నుంచే మద్యం విక్రయాలు మొదలై శని, ఆదివారాల్లో మరింత ఉధృతికి చేరుకున్నాయి. బార్లు, రెస్టారెంట్లు, పబ్బులు కూడా ఈ టైమ్ లో అధికంగా మద్యం విక్రయించాయి. తెలంగాణలో మొత్తం 2,260 మద్యం దుకాణాలు, 1,171 బార్లు మరియు రెస్టారెంట్లు ఉన్నాయి. పబ్బుల్లో కూడా మద్యం అమ్మకాలు జరగడం వల్ల రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు భారీగా ఆదాయం వచ్చింది. సెప్టెంబర్ 30 వరకు మద్యం విక్రయాలు రూ. 2,838 కోట్లకు చేరగా, అక్టోబర్ మొదటి పది రోజుల్లో రూ. 1,100 కోట్ల విలువైన అమ్మకాలు జరిగాయి. 10 రోజుల వ్యవధిలో 17 లక్షల 59 వేల బీర్లు విక్రయమయ్యాయని తెలుస్తోంది.