నామినేటెడ్ పదవుల విషయం కూటమి పార్టీల్లో తీవ్ర సంకటంగా మారిపోయింది. ఆశావహులు ఎక్కువ మంది ఉండడం.. ఎవరూ వదులుకునేందుకు, తప్పుకొనేందుకు ఇష్టపడకపోవడం గమనార్హం. పైగా.. ఎన్నికల సమయంలో తాము ఎంతో కష్టపడ్డామని, వైసీపీని గద్దె దించేందుకు కేసులు కూడా పెట్టించుకున్నామని చాలా మంది టీడీపీనాయకుల నుంచి అభ్యర్థనలు వస్తున్నాయి. వీరి సంఖ్య వేలల్లో ఉంది. కానీ, పదవుల సంఖ్య చాలా చాలా తక్కువగా ఉంది.
ఇదిలావుంటే, కూటమి పార్టీలైన జనసేన, బీజేపీ నుంచి కూడా నామినేటెడ్ పదవుల విషయంలో పోటీ బాగానే ఇస్తున్నాయి. తమకు కూడా పదవులు కావాలని నిత్యం జనసేన, బీజేపీ కార్యాలయాలకు సిఫారసులు అందుతూనే ఉన్నాయి. దీంతో ఇటు వీరిని కూడా సంతృప్తి పరచాల్సిన బాధ్యత టీడీపీకి ఏర్పడింది. ఈ పరిణామాలతో ఒకరికి ఇచ్చి.. ఒకరికి ఇవ్వకపోతే.. ఇబ్బందులు తప్పవని భావించిన చంద్రబాబు తమ్ముళ్ల ఆశలను సర్దుమణిగేలా చేస్తున్నారు.
అందరికీ పదవులు ఇవ్వాలని ఉన్నా.. ఇచ్చే పరిస్థితి లేదని ఆయన పరోక్షంగా చెప్పుకొస్తున్నారు. అంతే కాదు.. తానే అసలైన బాధితుడినని, 53 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉండి వచ్చానని చెప్పడం ద్వారా.. అన్ని రోజులపాటు బాధలు అనుభవించిన నాయకుడు మరొకరు లేరని కూడా ఆయన వెల్లడిస్తున్నారు. తద్వారా.. ఆశావహులు చెబుతున్న మాటలను తగ్గించడంతోపాటు.. వారిని వారే సమీక్షించుకునేలా.. గట్టి పట్టు పట్టకుండా ఉండేలా కూడా.. చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇది, ఎంత వరకు సక్సెస్ అవుతుందనేది పక్కన పెడితే.. ప్రస్తుతానికి అయితే.. నాయకులు చల్లబడ్డారనేది వాస్తవం. నిన్న మొన్నటి వరకు ఉన్న వేడి, వేగం..ఇప్పుడు తమ్ముళ్లలో తగ్గిపోయింది. ఎందుకంటే.. వారి వారే సమీక్షించుకుంటున్నారు. ఔను.. చంద్రబాబు కన్నా మనం బాధితులం కాదు కదా! అని భావిస్తున్నారు. దీంతో నిత్యం పదుల సంఖ్యలో పదవుల కోసం క్యూ కట్టిన నాయకులు.. ఇప్పుడు తగ్గిపోతుండడం గమనార్హం. ఇదిమంచి పరిణామమే అయినా.. వారికి కూడా ఊరటనివ్వాల్సిన అవసరం చంద్రబాబుపై ఉంటుందని అంటున్నారు సీనియర్ నాయకులు. వచ్చేవి ఎన్నికల మాసాలని.. కాబట్టి జాగ్రత్తగా అడుగులు వేయాని వారు కోరుతున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates