పవన్ పట్టుకు బాలినేని లొంగిపోయారా?

బాలినేని శ్రీనివాస రెడ్డి జనసేనలో చేరిన తర్వాత పెద్దగా యాక్టివ్ గా లేని సంగతి తెలిసిందే. అధికారికంగా జనసేన నిర్వహించే కార్యక్రమాల్లో బాలినేని పెద్దగా కనిపించిన దాఖలాలు లేవు. ఒంగోలు జనసేనలో చక్రం తిప్పాలనుకున్న బాలినేనికి పవన్ ఫ్రీ హ్యాండ్ ఇవ్వలేదు. తన వైరివర్గం అయిన టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్థన్ కు చెక్ పెట్టాలని భావించిన బాలినేనికి చుక్కెదురైంది. దీంతో, జనసేనలో బాలినేని ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్లు కనిపిస్తోంది.

అయితే, 2029 ఎన్నికలకు ముందు బాలినేని మళ్లీ సొంతగూటికి చేరతారని గట్టిగా టాక్ ఉంది. అందుకే, సీనియర్ మంత్రి అయిన బాలినేనికి పవన్ ఎటువంటి పదవి ఇవ్వలేదని తెలుస్తోంది. వాస్తవానికి ఎమ్మెల్సీ పదవి ఆశించి మంత్రి అవుదామనుకున్న బాలినేనికి భంగపాటు ఎదురైంది.

దీంతో, బాలినేని కక్కలేక మింగలేక అన్న రీతిలో జనసేనలో కొనసాగుతున్నారు. బాలినేని వంటి సీనియర్ నేతను పవన్ హ్యాండిల్ చేసిన తీరు ప్రశంసనీయం. ఈ క్రమంలోనే ఉగాది సందర్భంగా పవన్ ను కలిసిన బాలినేని చేసిన ట్వీట్ వైరల్ అయింది.

ఆయన మాకు ఒక నాయకుడు మాత్రమే కాదు…నమ్మకం, ఆదరణ, ఆశ్రయం అంటూ బాలినేని తన ఎక్స్ ఖాతాలో పెట్టిన పోస్ట్ చర్చనీయాంశమైంది. పవన్ ఉడుంపట్టుకు బాలినేని లొంగిపోయినట్లే కనిపిస్తోంది. మరి, భవిష్యత్తులో పవన్ ను బాలినేని ఏ రకంగా ట్రీట్ చేస్తారు? ఒంగోలు జనసేనలో బాలినేని రాజకీయ భవితవ్యం ఏమిటి అన్న ప్రశ్నలకు కాలమే సమాధానం చెబుతుంది.