ల‌డ్డూ విష‌యం ఏంటి: చంద్ర‌బాబుకు మోడీ ప్ర‌శ్న‌?

టీడీపీ అధినేత‌, ఏపీ సీఎం చంద్ర‌బాబు తాజాగా ఢిల్లీలో ప‌ర్య‌టిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న సోమ‌వారం సాయంత్రం 5 గంట‌ల స‌మ‌యంలో ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీతో భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న రాష్ట్రానికి సంబంధించిన ప‌లు అంశాల‌పై ప్ర‌ధానితో చ‌ర్చించిన‌ట్టు తెలిసింది. ముఖ్యంగా చంద్ర‌బాబు కంటే ఎక్కువ‌గా ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ తిరుమ‌ల శ్రీవారి ల‌డ్డూ ప్ర‌సాదంపై ఆరా తీసిన‌ట్టు జాతీయ మీడియా వ‌ర్గాలు చెబుతున్నాయి. “అస‌లేం జ‌రిగింది?” అని చంద్ర‌బాబును గుచ్చి గుచ్చి ప్ర‌శ్నించిన‌ట్టు స‌మాచారం.

దీనిపై చంద్ర‌బాబు కూడా ఎన్ డీడీబీ(నేష‌న‌ల్ డెయిరీ డెవ‌ల‌ప్ మెంట్ బోర్డు-గుజ‌రాత్‌) ఇచ్చిన నివేదిక‌ను కూడా ప్ర‌ధానికి అందించారు. ఈ సంస్థ ఇచ్చిన రిపోర్టులో నెయ్యి క‌ల్తీ జ‌రిగింద‌ని పేర్కొంద‌ని.. దీనినే తాను మీడియా ముందు చెప్పుకొచ్చాన‌ని చంద్ర‌బాబు వివ‌రించిన‌ట్టు జాతీయ మీడియా వ‌ర్గాలు చెబుతున్నాయి. ఇదేస‌మ‌యంలో తిరుమ‌ల ప‌విత్ర‌త‌ను, రోజుకు ఎంత మంది భ‌క్తులు వ‌స్తున్నారు? ఎంత‌మందికి లడ్డూ ప్ర‌సాదం పంపిణీ చేస్తున్నారు? అస‌లు ల‌డ్డూ ప్రాదాన్యం.. ఇలా అన్ని విష‌యాల‌ను కూడా చంద్ర‌బాబు వివ‌రించిన‌ట్టు తెలిసింది.

వైసీపీ హ‌యాంలో జ‌రిగిన కొన్ని లోపాలు.. చేసిన నిర్ణ‌యాల కార‌ణంగానే ఇలా త‌క్కువ ధ‌ర‌ల‌కు నెయ్యిని కొన్నార‌ని.. దీనివ‌ల్లే క‌ల్తీ జ‌రిగి ఉంటుంద‌ని తాము అభిప్రాయ‌ప‌డుతున్నామ‌ని ప్ర‌ధానికి చంద్ర‌బాబు వివ‌రించిన‌ట్టు తెలిసింది. ఇదిలావుంటే.. పోల‌వరం ప్రాజెక్టుకు సంబంధించి బ‌డ్జెట్‌లో కేటాయించిన 12 వేల కోట్ల రూపాయ‌ల్లో 6 వేల కోట్ల‌ను త‌క్ష‌ణం విడుద‌ల చేయాల‌ని కూడా అభ్య‌ర్థించారు. అదేవిధంగా వ‌ర‌ద సాయం పై నా చంద్ర‌బాబు చ‌ర్చించిన‌ట్టు పార్టీ వ‌ర్గాలు తెలిపారు. గ‌డిచిన 100 రోజులపాల‌న కూడా బాగుంద‌ని ప్ర‌ధాని మోడీ సంద‌ర్భంగా చంద్ర‌బాబును ప్ర‌శంసించిన‌ట్టు టీడీపీ ఎంపీలు తెలిపారు.