తిరుపతిలో జరుగుతున్న వారాహి డిక్లరేషన్ సభలో వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ పై జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ పై 32 కేసులు పెండింగ్లో ఉన్నాయని, బెయిల్ మీద ఉన్న వ్యక్తి, జైల్లో 16 నెలలు ఉన్న వ్యక్తిని ఎలా నమ్ముతామని పవన్ ప్రశ్నించారు. జగన్ పై ఉన్న తీవ్రమైన కేసులు చాలా కాలంగా పెండింగ్ లో ఉన్నాయని, వాటిపై సత్వర విచారణ చేసి చర్యలు తీసుకోవాలని కోర్టులను పవన్ అభ్యర్థించారు.
లడ్డూ కల్తీ వైసీపీ చేసింది అని అనలేదని, వారు ఏర్పాటు చేసిన టీటీడీ బోర్డు లో తప్పులు జరిగాయంటున్నామని పవన్ అన్నారు. విచారణకు సహకరించకుండా వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారని, ఎందుకు భుజాలు తడుముకుంటున్నారని ప్రశ్నించారు. ఏనాడూ జగన్ లడ్డూ కల్తీ చేశాడు అని తాము చెప్పలేదని, అయినా సరే గుమ్మడి కాయ దొంగ లాగా భుజాలు తడుముకుంటున్నాడని ఎద్దేవా చేశారు.
వైసీపీకి 11 సీట్లు ఎక్కువయ్యాయని, ఈ సారి ఒక సీటుకు పరిమితం చేద్దామని పవన్ చమత్కరించారు. ధైర్యం లేని చోట మంచి విలువలు నశిస్తాయని, ధైర్యం లేని చోట వైసీపీ లాంటి శక్తులు సనాతన ధర్మాన్ని మట్టి కరిపిస్తాం అని మాట్లాడుతాయని పవన్ అన్నారు. 151 మంది ఎమ్మెల్యేలు, 23 మంది ఎంపీలు ఉన్న వైసీపీ ప్రభుత్వం తనను సరిహద్దులో ఆపేస్తే ధైర్యంగా వచ్చానని, దానికి కారణం సనాతన ధర్మం ఇచ్చిన ధైర్యం అని పవన్ చెప్పారు.
గతంలో టీటీడీ ఈవోగా పనిచేసిన ధర్మారెడ్డి గారు కనిపించడం లేదని, ఎక్కడకు మాయం అయ్యారని సెటైర్లు వేశారు. 2005 సమయంలో కూడా ఆయన మీద చాలా ఆరోపణలు ఉన్నాయని, అన్ని బయటకు తీస్తామిన పవన్ హెచ్చరించారు. తిరుమలలో ఈవోగా శ్యామల రావు గారు భాద్యతలు తీసుకున్నాక ఎప్పుడు కల్తీ జరగలేదు అని చెప్తే, అసలు కల్తీ జరగలేదు అని వైసీపీ నేతలు మాట్లాడుతున్నారని పవన్ అన్నారు.
కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి లడ్డూ తయారీలో జంతువు కొవ్వు వాడారని, దాని గురించి తాను ప్రశ్నించకూడదా అని పవన్ అన్నారు. అటువంటి కల్తీ లడ్డూలను అయోధ్య రామాలయానికి పంపిస్తారా? అని గత ప్రభుత్వంపై పవన్ విరుచుకుపడ్డారు. తాను తన ధర్మానికి అన్యాయం, అవమానం జరుగుతుంటే చూస్తూ ఊరుకోబోనని అన్నారు. తనను మాట్లాడవద్దు, రాజకీయం చేయవద్దు అంటున్నారని, తిరుమల శ్రీవారి ప్రసాదం అపవిత్రం అయితే తాను మాట్లాడకూడదా? అని పవన్ ప్రశ్నించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates