వైసీపీ రాజ్యసభ సభ్యులు ఒక్కొక్కరుగా కాదు.. గుండుగుత్తగానే పార్టీ నుంచి జంప్ చేస్తున్నారా? వారి ప్లాన్ వేరేగా ఉందా? అంటే.. ఔననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ప్రస్తుతం ఇప్పటి వరకు జరిగిన పరిణామాలను గమనిస్తే.. వైసీపీ నుంచి ఇద్దరు నేరుగా బయటకు వచ్చారు. మోపిదేవి వెంకట రమణ, బీద మస్తాన్ రావులు.. పార్టీకి, వైసీపీ ఇచ్చిన రాజ్యసభ సీట్లకు కూడా రాజీనామాలు సమర్పించారు. వీరిలో రమణ.. టీడీపీ తీర్థం పుచ్చుకుంటానని చెప్పారు. ఇక, బీద వ్యవహారం ఇంకా తేలలేదు.
అయితే.. బీద మస్తాన్ రావును బీజేపీ బుజ్జగిస్తున్నట్టు తెలుస్తోంది. ఆయన వ్యాపార వేత్తకావడం, రాజకీయంగా ఆయన అవసరాలు వంటివాటిని పరిగణనలోకి తీసుకుని.. తమ పార్టీలోకి రావాలంటూ.. బీజేపీ నేతలు కోరుతున్నారు. సరే.. వీరి విషయం ఇలా ఉంటే.. ఇప్పుడు వైసీపీపై మరో పిడుగు పడనుంది. వైసీపీ ఏరికోరి హైదరాబాద్ నుంచి తెచ్చుకుని మరీ రాజ్యసభ సీటును కట్టబెట్టిన బీసీ ఉద్యమ నాయకుడు.. ఆర్. కృష్ణయ్య కూడా.. బీజేపీ బాట పడుతున్నారని తెలిసింది.
ఆయన మాత్రం లేదు-కాదు.. అని పైకి అంటున్నా.. తెరవెనుక జరగాల్సిన ముచ్చటజరిగిపోతోందని.. జాతీయ మీడియా చెబుతుండడం గమనార్హం. త్వరలోనే బీసీ కృష్ణయ్యను బీజేపీ తన శిబిరంలోకి లాగే యనుందని కూడా సమాచారం. బీసీ, ఓబీసీ సామాజిక వర్గం ఓటు బ్యాంకు కేంద్రంగా బీజేపీ రాజకీయాలు చేస్తున్న విషయం తెలిసిందే. పదేపదే ప్రధాని మోడీ సహా అందరూ.. బీసీ జపం చేస్తున్నారు. ఈ ఏడాది జరిగిన పార్లమెంటు ఎన్నికల్లోనూ బీసీ కార్డుతోనే విజయం దక్కించుకున్నారు.
ఈ నేపథ్యంలో బలమైన బీసీ నాయకుడిగా ఉన్న కృష్ణయ్యను తమవైపు తిప్పుకోగలిగితే.. ఏపీ, తెలంగాణ రెండు చోట్లా కూడా.. తమకు మేలు జరుగుతుందని కమల నాథుల ఆలోచనగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇక, బలిజ సామాజిక వర్గానికి చెందిన తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వైసీపీ కీలక రాజ్యసభ సభ్యుడు కూడా.. బీజేపీ వైపు చూస్తున్నారన్నది ఇప్పుడు జాతీయ స్థాయిలో చర్చకు వచ్చింది.
బాబుతో విభేదం..బీజేపీ లక్కు!
చిత్రం ఏంటంటే.. ఆర్. కృష్ణయ్యకు.. తూర్పుకు చెందిన.. మరో రాజ్యసభసభ్యుడికి చంద్రబాబుతో విభేదాలు ఉన్నాయి. ఇది బీజేపీకి లక్కుగా మారింది. ఈ నేపథ్యంలోనే వారు బీజేపీవైపు అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. దీనిపై నేడో రేపో ప్రకటన వచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.