టాలీవుడ్ లెజెండరీ నటుడు మోహన్ బాబు ఒకప్పుడు నారా చంద్రబాబుతో ఎంతో సన్నిహితంగా ఉండేవారు. కానీ మధ్యలో ఆయనతో విభేదాలు వచ్చాయి. 2019 ఎన్నికల ముంగిట తమ కాలేజీకి ఫీజు రీఎంబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించకపోవడంపై చంద్రబాబుకు వ్యతిరేకంగా రోడ్డెక్కి పోరాటం చేయడమే కాక.. వైసీపీకి అనుకూలంగా ఎన్నికల ప్రచారం కూడా నిర్వహించారు మోహన్ బాబు.
జగన్‌కు సోదరి వరుస అయ్యే వెరోనికాను మంచు విష్ణు పెళ్లి చేసుకున్న నేపథ్యంలో జగన్ తనకు మేనల్లుడంటూ మాట్లాడేవారాయన. ఎన్నికలకు ముందు, తర్వాత కొంత కాలం జగన్‌తో మోహన్ బాబు కుటుంబం సన్నిహితంగానే మెలిగింది. కానీ తర్వాత ఏం జరిగిందో తెలియదు. దూరం పెరిగింది. పార్టీ కోసం ఎన్నికల ప్రచారం కూడా చేసిన తనను జగన్ గుర్తించకపోవడం, ఫీజు రీఎంబర్స్‌మెంట్ సమస్య జగన్ హయాంలో ఇంకా పెద్దదిగా మారడం ఆయనకు కోపం తెప్పించినట్లుంది.
జగన్ మీద విమర్శలు చేయలేదు కానీ.. ఆయనకు అనుకూలంగా కూడా మోహన్ బాబు మాట్లాడలేదు గత కొన్నేళ్లలో. ఒక ఇంటర్వ్యూలో పరోక్షంగా జగన్ మీద అసంతృప్తిని వ్యక్తం చేశారు కూడా. తాజా పరిణామాలు గమనిస్తుంటే జగన్‌తో మోహన్ బాబుకు పూర్తిగా సంబంధాలు చెడినట్లే కనిపిస్తోంది.
తాజాగా తిరుమల లడ్డు వివాదంలో వైసీపీ ఎంతగా బద్నాం అవుతోందో తెలిసిందే. ఈ అంశంపై మోహన్ బాబు కూడా స్పందించారు. లడ్డుకు వాడిన నెయ్యి కల్తీ అయిందన్న ఆరోపణలపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన మోహన్ బాబు.. బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇక్కడ ఆరోపణలు, విమర్శలు ఎదుర్కొంటోంది జగన్ అండ్ కోనే కావడంతో ఆయన తన మేనల్లుడికి ఎర్రజెండా చూపిస్తున్నట్లే. కేవలం ఈ డిమాండ్‌తో సరిపెట్టకుండా తనకు అత్యంత ఆత్మీయుడు, మిత్రుడు అంటూ చంద్రబాబును కొనియాడారు. ఆయనకు అంతా మంచి జరగాలని ఆకాంక్షించారు. చూస్తుంటే జగన్‌కు కటీఫ్ చెప్పి మళ్లీ చంద్రబాబుతో కలిసిపోయే ప్రయత్నం మోహన్ బాబు చేస్తున్నట్లు కనిపిస్తోంది. మరోవైపు మంచు విష్ణు సైతం లడ్డు వివాదం మీద స్పందిస్తూ.. పవన్ కళ్యాణ్‌కు జై కొట్టిన సంగతి తెలిసిందే.
Gulte Telugu Telugu Political and Movie News Updates