విజయవాడ, గుంటూరు, బాపట్ల, ఏలూరు జిల్లాల్లో వరదల కారణంగా నష్టపోయిన బాధితులకు ఏపీ ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. స్వయంగా సీఎం చంద్రబాబు ఈ పరిహారానికి సంబంధించిన ప్రకటన చేశారు. వరదల కారణంగా సర్వస్వం కోల్పోయిన వారికి రూ.25000 చొప్పున సాయం అందిస్తామన్నారు. గతంలో ఉన్న ప్రభుత్వం వరద బాధితులకు రూ.4000 ఇచ్చి చేతులు దులుపుకొందన్నారు. కానీ, తాము మానవతా దృక్ఫథంతో ఈ మొత్తాన్ని 6 రెట్లు పెంచి ఇస్తున్నామని తెలిపారు. కానీ, ఇది చరిత్రలో తొలిసారిగా ఇంత సాయం అందిస్తున్నామన్నారు.
అయితే.. నష్టాన్ని పూర్తిగా భర్తీ చేయడం ఎవరికీ సాధ్యం కాదని.. బాధితులు కోలుకునేందుకు దోహద పడతా మన్నారు. ఇక, పాక్షికంగా దెబ్బతిన వారికి రూ.10 వేల చొప్పున ఇవ్వనున్నట్టు తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాల్లోని అపార్ట్‌మెంట్లలో ఫస్ట్ ఫ్లోర్‌లో ఉన్న వారికి కూడా ఈ మొత్తాన్ని అందించనున్నట్టు తెలిపారు. గతంలో ఇలాంటి వారికి ఎలాంటి పరిహారం అందేది కాదని చెప్పారు. ఇక, రైతులకు ముందుగానే ప్రకటించినట్టు హెక్టారుకు రూ.10 చొప్పున సాయం చేయనున్నట్టు తెలిపారు. వాహనాలుకూడా వరద ప్రభావంతో తీవ్రంగా దెబ్బతిన్నాయని తెలిపారు.
వరద కారణంగా దెబ్బతిన్నవాహనాలకు ఇన్సూరెన్స్ ఉంటే క్లయిమ్ చేసుకునేందుకు సర్కారు అన్ని విధాలా సహకరిస్తుందని చంద్రబాబు తెలిపారు. అయినప్పటికీ.. వాహనాల స్థాయిని బట్టి ద్విచక్ర వాహనాలకురూ.3 వేలు చొప్పున, ఆటోలు, ట్యాక్సీలకు 10 వేల చొప్పున సాయం చేయనున్నట్టు చెప్పారు. అలాగే.. చేనేత కార్మికులు కనుక పూర్తిగా నష్టపోయి ఉంటే(బాపట్లలో ఎక్కువగా ఉన్నారు) వారికి కూడా రూ.25 వేల చొప్పున సాయం అందిస్తామని, పాక్షికంగా నష్టపోయిన వీవర్స్‌కు రూ.15 వేల చొప్పున సాయం ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఇప్పటికే ఎన్యూమరేషన్ పూర్తయిందన్నారు.
వరదల కారణంగా ఇబ్బందులు పడ్డ ప్రతి ఒక్కరికీ ఈ సాయం అందుతుందన్నారు. అదేవిధంగా వరదల సమయంలో పది రోజుల పాటు సర్కారు అన్ని విధాలా ప్రజలను ఆదుకుందని, నిత్యావసరాలను కూడా అందించామన్నారు. పాలు, నీళ్లు, ఆహారం కూడా అందించామని చెప్పారు. స్వచ్ఛంద సంస్థలు, పారిశ్రామిక వేత్తలు, సినీరంగానికిచెందినవారు.. ఇలా అందరూ ముందుకు వచ్చి మానవత్వాన్ని చాటుకున్నారని తెలిపారు.