జెత్వానీ ఇష్యూపై డీజీపీ ఫుల్ రిపోర్టు

Kadambari Jethwani

ఒక మహిళ కేసు.. దానికి సంబంధించి ముగ్గురు ఐపీఎస్ లు.. అందులో ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులు. వారందరిని సస్పెన్షన్ వేటు వేస్తూ తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది. ఒకే కేసులో ఇలా ముగ్గురు ఐపీఎస్ లపై వేటు పడటం ఏపీ చరిత్రలో ఇదే తొలిసారిగా చెబుతున్నారు.

బాలీవుడ్ సినీ నటి కాదంబరి జెత్వానీపై కేసు నమోదు చేయటానికి ముందే ఆమెను ముంబయి నుంచి తీసుకురావటం.. ఆమెపై ఫిర్యాదు రావటానికి ముందే విమానం టికెట్లు కొనుగోలు చేయటం మొదలు ప్రతి మలుపులోనూ చట్టానికి వ్యతిరేకంగా వ్యవహరించిన అదికారుల పై వేటు వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. పెను సంచలనంగా మారిన ఈ ఉదంతంపై డీజీపీ సమగ్ర నివేదికను సిద్ధం చేశారు.

ఎఫ్ఐఆర్ నమోదు కాక ముందే అరెస్టుకు ఆదేశించి తప్పు చేసినట్లుగా ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ సీతారామాంజనేయులుగా తేలితే.. ఫిర్యాదు అందక ముందే విమాన టికెట్లు కొని టీంను ముంబయికి పంపిన కాంతిరాణా వ్యవహారం బయటకు రాగా.. దర్యాప్తులో ప్రాథమిక సూత్రాల్ని విస్మరించిన విశాల్ గున్ని పై వేటు పడింది.

గత ప్రభుత్వంలో ముఖ్యనేత సన్నిహితుడైన పారిశ్రామికవేత్తను కాపాడేందుకు ఒక మహిళను.. ఆమె కుటుంబాన్ని అక్రమ కేసులో ఇరికించి.. అడ్డగోలుగా వ్యవహరించిన పాపానికి ఫలితంగా తాజా వేటుగా అభివర్ణిస్తున్నారు.

సినీ నటి జెత్వానీ అరెస్టుకు సీఎం కార్యాలయంలోనే కుట్ర పథక రచన జరిగినట్లుగా తేల్చారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసులో ఈ ముగ్గురు ఐపీఎస్ లు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని.. అధికార దుర్వినియోగంతో పాటు తీవ్రమైన దుష్ప్రవర్తనకు కారణమైనట్లుగా డీజీపీ ద్వారకా తిరుమలరావు ప్రభుత్వానికి పూర్తిస్థాయి రిపోర్టును ఇచ్చారు.

సాక్షులను.. సహచరులను ప్రభావితం చేసే సామర్థ్యం ఉన్న వీరు ఆధారాల్ని ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారని.. అందులో భాగంగా ముంబయికి కూడా వెళ్లారని పేర్కొన్నారు. డీజీపీ నివేదిక నేపథ్యంలో ముగ్గురిని సస్పెండ్ చేస్తూ సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఆదివారం వేర్వేరుగా ఉత్తర్వులు ఇచ్చారు. ప్రభుత్వ అనుమతి లేకుండా హెడ్ క్వార్టర్స్ విడిచి పెట్టి వెళ్లొద్దంటూ ఆదేశాలు జారీ చేశారు. ఇంతకూ డీజీపీ రిపోర్టులో కీలక అంశాల్ని చూస్తే..

  • విజయవాడ సీపీ కాంతిరాణా తాతా.. డీసీపీ విశాల్ గున్నిలను 2024 జనవరి 31న సీఎంవోకు పిలిచిన నాటి నిఘా డీజీ సీతారామాంజనేయులు వారితో మాట్లాడారు. ముంబయికి చెందిన సినీ నటి కాదంబరి జెత్వానీని అరెస్టు చేయాలన్నారు. అప్పటివరకు ఆమెపై ఎలాంటి కేసు లేదు.
  • ఫిబ్రవరి 2న ఉదయం ఆరున్నర గంటలకు ఆమెపై కేసు నమోదు చేసినట్లుగా రికార్డులు చూపిస్తున్నాయి. అంటే కేసుకు ముందే.. ఆమె అరెస్టుకు సీతారామాంజనేయులు ఆదేశాలు ఇచ్చారు.
  • అసంపూర్తి సమాచారం ఆధారంగా కేసును నడిపించటం.. పరిశీలన లేకుండానే దర్యాప్తును వేగవంతం చేయటంలో కీలకభూమిక పోషించారు. ఇది పూర్తిగా అధికార దుర్వినియోగమే అవుతుంది.
  • డీజీ చెప్పిన నోటి మాటతోనే నాటి విజయవాడ సీపీ కాంతిరాణా బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారు. కాదంబరి అరెస్టుకు ఆదేశించటంతో పాటు.. ఎఫ్ఐఆర్ నమోదుకు ఒక రోజు ముందే విమాన టికెట్లు బుక్ చేయటంలో కీలక భూమిక పోషించారు. కేసు విచారణను పర్యవేక్షించటంలో ఘోరంగా ఫెయిల్ అయ్యారు. ప్రాథమిక విచారణ చేయకుండానే జెత్వానీని అరెస్టు చేయాలని జనవరి 31న అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.
  • సాధారణంగా నిందితుల అరెస్టుకు ఇతర రాష్ట్రానికి పంపేముందు రాతపూర్వక ఆదేశాలు ఇస్తారు. అదేమీ జరగలేదు. విమానంలో వెళ్లేందుకు అనుమతి లేకున్నా.. అదేమీ పట్టించుకోలేదు.
  • నాటి డీసీపీ విశాల్ గున్ని.. ఏడీసీపీ రమణమూర్తి.. ఇన్ స్పెక్టర్ శ్రీధర్.. ఎస్ ఐ షరీఫ్ లకు ఫిబ్రవరి 1నప్రయాణానికి విమాన టికెట్లను బుక్ చేవారు. అప్పటికి జెత్వానీకి వ్యతిరేకంగా ఎఫ్ఐఆర్ కూడా దాఖలు కాలేదు. కమిషనర్ సూచన మేరకు సీసీ తర్వాత ఇబ్రహీంపట్నం సీఐ సత్యానారాయణ.. ఆర్ ఎస్ఐ దుర్గాదేవి.. కానిస్టేబుళ్లు మౌనిక.. రమేశ్.. గీతాంజలి.. రమ్యలకు కూడా విమాన టికెట్లు తీసుకున్నారు.
  • ఎఫ్ఐఆర్ నమోదైన గంటకే ముంబయికి జర్నీ పెట్టుకున్నారు. కేసు పూర్వాపరాలు పరిశీలించకుండానే హడావుడిగా ముంబయికి వెళ్లి జెత్వానీను అరెస్టు చేయటం ద్వారా నాటి డీసీపీ విశాల్ గున్ని విధి నిర్వహణంలో ఘోరమైన తప్పునకు పాల్పడ్డారు.
  • ఫ్రిబవరి 2న ఉదయం ఆరున్నర గంటలకు ఎఫ్ఐఆర్ నమోదు కాగా.. ముందుగా నిర్ణయించుకున్నట్లే ఉదయం ఏడున్నర గంటలకు ఉన్నతాధికారుల నుంచి రాతపూర్వక ఆదేశాలు లేకుండానే ముంబయికి బయలుదేరారు.
  • నటి అరెస్టుకు ముందు ఎలాంటి విచారణ చేయలేదు. సరైన సాక్ష్యాలు.. డాక్యుమెంటరీ ఆధారాలు లేకుండానే.. ఎఫ్ఐఆర్ నమోదైన కొద్దిగంటల్లోనే వ్యవహారం మొత్తాన్ని నడిపించారు. దర్యాప్తులో ప్రాథమిక సూత్రాల్ని పూర్తిగా వదిలేశారు.