జ‌వ‌హ‌ర్‌, ఏలూరి, గ‌న్ని.. విష‌యంలో బాబు రాంగ్ స్టెప్‌?

ఒక త‌ప్పు నుంచి పాఠం నేర్చుకుని.. స‌రిదిద్దుకునే ప్ర‌య‌త్నం ఎవ‌రైనా ఏ పార్టీలో అయినా..చేస్తారు. కానీ, టీడీపీలో మాత్రం ఆ దిశ‌గా పాఠాలు నేర్చుకుంటున్న ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదని ప‌రిశీలకులు చెబుతున్నారు. వ్య‌వ‌స్థీకృతంగా తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న పార్టీని గ‌ట్టెక్కించేందుకు పార్టీ అధినేత‌గా చంద్ర‌బాబు తాజాగా చేసిన ప్ర‌యోగం.. పార్ల‌మెంట‌రీ జిల్లా క‌మిటీల‌నుఏర్పాటు చేయ‌డం, వాటికి ఇంచార్జ్‌ల‌ను నియ‌మించ‌డం. మంచిదే. ఇప్ప‌టికైనా ఓ కీల‌క ఘ‌ట్టానికి చంద్ర‌బాబు శ్రీకారం చుట్టారు. ఇక‌, ఇప్పుడు పార్టీ ప‌రుగులు పెడుతుందా? లేదా? అనేది కాలం నిర్ణ‌యిస్తుంది.

కానీ, తాజా నిర్ణ‌యంలోనూ ప‌లు లోపాలు.. పొర‌పాట్లు చోటు చేసుకున్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. అయితే, ఇది తెలియ‌క జ‌రిగితే.. స‌రే.. మున్ముందు స‌రిదిద్దుకునే అవ‌కాశం ఉంటుంది. కానీ, ఇప్ప‌టికే తెలిసిన పొర‌పాట్ల‌ను మ‌రింత‌గా చేస్తే.. ఇప్పుడు ఇదే టీడీపీలో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. పార్టీ పార్ల‌మెంట‌రీ జిల్లా చీఫ్‌ల ఎంపిక విష‌యంలో మాజీ మంత్రి కేఎస్ జ‌వ‌హ‌ర్‌కు అవ‌కాశం ఇచ్చారు. అదేవిధంగా ప‌రుచూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబ‌శివ‌రావుకు ఛాన్స్ ఇచ్చారు. ఇక‌, పశ్చిమ గోదావ‌రి జిల్లా ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే గ‌న్ని వీరాంజ‌నేయులుకు కూడా అవ‌కాశం ఇచ్చారు.

కానీ, వీరిపై ఆయా జిల్లాల్లోని త‌మ్ముళ్ల‌లో తీవ్ర అసంతృప్తి ఉంద‌నే విష‌యం చంద్ర‌బాబుకు తెలుసు. ఏలూరి విష‌యంలో ఒకింత ఫ‌ర్వాలేద‌ని అనుకున్నా.. జ‌వ‌హ‌ర్‌కు రాజ‌మండ్రి పార్ల‌మెంటు జిల్లా ఇంచార్జ్ ప‌ద‌వి ఇవ్వ‌డాన్ని అక్క‌డి నాయ‌కులు తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నారు. 2014లో కొవ్వూరు అసెంబ్లీ నుంచి గెలిచిన ఈయ‌న‌.. త‌ర్వాత‌.. పార్టీ నేత‌ల ఛీత్కారాన్ని ఎదుర్కొన్నారు. ఈ క్ర‌మంలోనే గ‌త ఎన్నిక‌ల్లో తిరువూరుకు బ‌దిలీ అయ్యారు. ఇప్ప‌టికీ.. ఈయ‌నపై కొవ్వూరు స‌హా రాజ‌మండ్రి నేత‌ల్లో సానుకూలత లేదు.

ఇక‌, గ‌న్ని వీరాంజనేయులు షార్ప్ షూట‌ర్‌. పార్టీలో అనేక స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించే విష‌యంలో ఆయ‌న దూకుడుగా ఉన్న‌మాట నిజ‌మే. అయితే, ఇప్పుడు ఆ ప‌రిస్థితి లేదు. పైగా ఆయ‌న ఉంగుటూరు ఇంచార్జ్‌గా కూడా ఉన్నారు. ఇలా.. ఒక‌టికి రెండు ప‌ద‌వులు ద‌క్కించుకున్న‌వారికి, కొన్ని చోట్ల అసంతృప్తి సెగ‌లు ఉన్న వారికి చంద్ర‌బాబు అవ‌కాశం ఇవ్వ‌డం ఏంట‌నే ప్ర‌శ్న‌లు వ‌స్తున్నాయి. ఇంకా చాలా మంది నాయ‌కులు ఎదురు చూస్తున్నార‌ని, వీరికి ఎలాంటి గుర్తింపు లేకుండా పోయింద‌ని అంటున్నారు. మ‌రి ఇది మున్ముందు పార్టీకి ఇబ్బందిగా మార‌కుండా చూసుకోవాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంద‌నేది వాస్త‌వం.