మ‌రో ముప్పు: చంద్ర‌బాబు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌

ఏపీకి మ‌రో ముప్పు పొంచి ఉంద‌ని.. దీనిపై కూడా దృష్టి పెడుతున్నామ‌ని సీఎం చంద్ర‌బాబు చెప్పారు. విజ‌య‌వాడ‌లో ఆదివారం రాత్రి ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. ఉత్త‌రాంధ్ర జిల్లాలు కూడా ప్ర‌కృతి విల‌యానికి గుర‌య్యే అవ‌కాశం ఉంద‌ని స‌మాచారం అందిన‌ట్టు చెప్పారు. విశాఖ‌ప‌ట్నం, అల్లూరి సీతారామ‌రాజు జిల్లాల్లో భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయ‌ని.. కొండ‌చ‌రియ‌లు విరిగి ప‌డే ప్ర‌మాదం ఉంద‌ని స‌మాచారం అందిన‌ట్టు తెలిపారు.

ఈ నేప‌థ్యంలో కొండ ప్రాంతాల్లో ఉంటున్న‌వారిని అక్క‌డ నుంచి సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించిన‌ట్టు సీఎం వివ‌రించారు. జిల్లాల క‌లెక్ట‌ర్ల‌ను కూడా అప్ర‌మ‌త్తం చేశామ‌న్నారు. ఏలేరు ప్రాజెక్టుకు వ‌రద ప్ర‌భావం పెరిగింద‌ని.. దీనివ‌ల్ల కాకినాడ జిల్లాకు కూడా ముప్పు పొంచి ఉంద‌ని తెలిపారు. ఈ నేప‌థ్యంలో ఆ జిల్లాలోనూ చ‌ర్య‌లు చేప‌ట్టామ‌న్నారు. ఇక‌, తాజాగా విజ‌య‌వాడ‌, గుంటూరు, తెనాలి, నూజివీడు త‌దిత‌ర ప్రాంతాల్లో సంభ‌వించిన వ‌ర‌ద‌ల‌పై గ‌వ‌ర్న‌ర్‌కు కూడా నివేదిక స‌మ‌ర్పించిన‌ట్టు చెప్పారు.

ప్ర‌భుత్వం చేప‌ట్టిన స‌హాయ‌క చ‌ర్య‌ల‌పై గ‌వ‌ర్న‌ర్ అబ్దుల్ న‌జీర్ సంతోషం వ్య‌క్తం చేసిన‌ట్టు చంద్ర‌బాబు తెలిపారు. అంతాపార‌ద‌ర్శ‌కంగా జ‌రుగుతోంద‌ని.. సోమ‌వారం నుంచి ఎన్యూమ‌రేష‌న్ ప్ర‌క్రియ‌ను ప్రారంభి స్తున్న‌ట్టు తెలిపారు. బాధిత కుటుంబాల‌ను ఆదుకునేందుకు ప్ర‌భుత్వం అన్ని విధాలా సాయం చేస్తుందన్నారు. ఎన్యూమ‌రేష‌న్ ద్వారా వాస్త‌వ న‌ష్టం తెలుస్తంద‌న్నారు. దీంతో కేంద్రానికి మ‌రోసారి నివేదిక పంపించి.. పూర్తిస్థాయి న‌ష్టంపై ఒక అంచ‌నాకు వ‌స్తామ‌న్నారు.

వ‌ర‌ద త‌గ్గ‌లేదు…

విజ‌య‌వాడ‌లో వ‌ర‌ద ప‌రిస్థితిపైనా చంద్ర‌బాబు స్పందించారు. శివారు ప్రాంతంలో ఇంకా వ‌ర‌ద త‌గ్గ‌లేద‌న్నారు. ఇంకా 0.51 టీఎంసీల వ‌ర‌ద నీరు నిలిచి ఉంద‌న్నారు. భారీ వ‌ర్షాలు రాక‌పోతే.. వ‌ర‌ద నీరు సోమ‌వారం సాయంత్రానికి త‌గ్గుతుంద‌ని తెలిపారు. ఇక‌, వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల్లో అంటు వ్యాధులు ప్ర‌బ‌లే అవ‌కాశం ఉంద‌ని.. దీని నుంచి ప్ర‌జ‌ల‌ను ర‌క్షించేందుకు వైద్య శిబిరాల‌ను ఏర్పాటు చేస్తున్నామ‌న్నారు.