హైడ్రాతో ప‌నిలేదు..మేమే కూలుస్తాం: ముర‌ళీ మోహ‌న్‌

ప్ర‌ముఖ సినీ న‌టుడు ముర‌ళీ మోహ‌న్‌కు చెందిన జ‌య‌భేరి నిర్మాణ సంస్థ‌కు సంబంధించి రంగ‌లాల్ కుంట‌లో నిర్మించిన అపార్ట్‌మెంటుకు హైడ్రా నోటీసులు ఇచ్చిన విష‌యం తెలిసిందే. శ‌నివారం మ‌ధ్యా హ్నమే ఈ నిర్మాణానికి సంబంధించి హైడ్రా అధికారులు నోటీసులు జారీ చేశారు. దీనిపై ఆదివారం ముర ళీ మోహ‌న్ స్పందించారు. త‌మ నిర్మాణాలు న్యాయ స‌మ్మ‌త‌మేన‌ని.. ఆక్ర‌మ‌ణ‌లు జ‌రిగి ఉంటే.. త‌మే కూలుస్తామ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.

రంగ‌లాల్ కుంట చెరువు స‌మీపంలో నిర్మించిన జ‌య‌భేరి అపార్ట్‌మెంటు బఫర్‌ జోన్‌ లో 3 అడుగుల మేరకు రేకుల షెడ్‌ ఉన్న మాట వాస్త‌వ‌మేన‌ని.. దీనికోసం హైడ్రా రావాల్సిన అవ‌స‌రం లేద‌ని ముర‌ళీ మోహ‌న్ తెలిపారు. దీనిని తామే కూల్చి వేస్తామ‌న్నారు. తాము ఎలాంటి అక్రమణలకు పాల్పడలేదని చెప్పారు. నిబంధ‌న‌ల ప్ర‌కారం తాము న‌డుచుకుంటున్న‌ట్టు ముర‌ళీ మోహ‌న్ తెలిపారు.

నోటీసుల్లో ఏముంది?

జ‌య‌భేరి సంస్థ‌కు హైడ్రా ఇచ్చిన నోటీసుల్లో గచ్చిబౌలి ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌ లోని రంగలాల్‌ కుంట చెరువులో ఫుల్‌ ట్యాంక్‌ లెవల్‌, బఫర్‌ జోన్ లో ఈ సంస్థ నిర్మాణాలు చేసింద‌ని.. ఇవి నిబంధ‌న‌ల‌కు విరుద్ధ‌మ‌ని పేర్కొన్నారు. ఈ నిర్మాణాల‌ను తొలగించాలని జయభేరి నిర్మాణ సంస్థకు స్ప‌ష్టం చేశారు. మీరు కూల్చ‌క‌పోతే.. మేమే 15 రోజుల్లో స‌ద‌రు నిర్మాణాల‌ను కూల్చి వేస్తామ‌ని తెలిపారు. దీంతో ముర‌ళీ మోహ‌న్ తామే కూల్చి వేస్తామ‌ని పేర్కొన్నారు.