సినీ నిర్మాత, పార్ట్ టైం పొలిటీషియన్ కూడా అయిన అశ్వినీదత్ తెలుగుదేశం పార్టీకి గట్టి మద్దతుదారన్న సంగతి తెలిసిందే. గత ఏడాది అధికారంలోకి వచ్చిన వైకాపా సర్కారు అమరావతి నుంచి రాజధానిని విశాఖపట్నానికి తరలించడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఓవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అమరావతి రైతుల కోసం పోరాడుతుంటే అతడి అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి వెళ్లి ఏపీ సీఎం జగన్‌ను కలవడాన్ని అశ్వినీదత్ తప్పుబట్టిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు దత్ అమరావతి నుంచి రాజధానిని విశాఖకు తరలించడాన్ని నిరసిస్తూ కోర్టుకెక్కారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో గన్నవరం ఎయిర్‌పోర్టు కోసం ల్యాండ్ పూలింగ్ కింద ఆయన 39 ఎకరాలు ఇచ్చారు.
ఐతే దానికి సంబంధించి ఆ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలను వైకాపా సర్కారు తుంగలో తొక్కడాన్ని ఆయన ఆక్షేపించారు. తాను ప్రభుత్వానికి ఇచ్చిన భూమి ఎకరానికి రూ. కోటి 54 లక్షల విలువ ఉందని.. ఈ భూమికి సరిసమానమైన అంతే విలువ కలిగిన భూమిని రాజధాని అమరావతిలో కేటాయిస్తామని సీఆర్డీఏ ఒప్పందం చేసుకుందని.. కానీ ప్రస్తుత ప్రభుత్వం రాజధానిని వేరే చోటకు తరలించాలని నిర్ణయించిందని.. దీంతో తనకు అమరావతిలో ఇస్తామన్న భూమి ఎకరం రూ.30 లక్షలు కూడా విలువ చేయని పరిస్థితి నెలకొందని దత్ తన పిటిషన్లో తెలిపారు. ప్రస్తుతం తాను ఇచ్చిన 39 ఎకరాల రిజిస్ట్రేషన్ విలువ ఎకరం రూ.కోటి 84 లక్షలకు చేరుకుందని.. భూసేకరణ చట్టం కింద ఈ భూమికి 4 రెట్లు చెల్లించి ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా లేదా ఏపీ ప్రభుత్వం నిర్మాణాలు చేపట్టుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. తాను ఇచ్చిన 39 ఎకరాలకు రూ.210 కోట్లు చెల్లించి తీసుకోవాలని ప్రభుత్వాన్ని, ఎయిర్‌పోర్టు అథారిటీని పార్టీలుగా చేరుస్తూ దత్ పిటిషన్ వేశారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates