ఏపీ సీఎం చంద్రబాబుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. విజయవాడలో బుడమేరు పొంగిపోవడంతో ఆయన బాధిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. అయితే.. గురువారం మధ్యాహ్నం నుంచి మరోసారి బుడమేరుకు ఎగువ ప్రాంతాల నుంచి వరద రాక పెరిగింది. ప్రస్తుతం 10వేల క్యూసెక్కుల మేరకు వరద ప్రవాహం పెరిగింది. దీంతో ఈ వరద ప్రవాహాన్ని పరిశీలించి తగు చర్యలు చేపట్టేందుకు చంద్రబాబు క్షేత్రస్థాయిలో పర్యటనకు వెళ్లారు. సింగునగర్‌లోని రైల్వే ట్రాక్ పైకి ఎక్కి.. ఆయన పరిశీలించారు. ఈ సమయంలో ఇరిగేషన్ అధికారులు కూడా ఆయన వెంటే ఉన్నారు.
అయితే.. ఈ సమయంలో మధురానగర్ రైలు ట్రాక్‌పై విశాఖపట్నం నుంచి ఓ రైలు వస్తోంది. అయితే.. వరద ప్రవాహం, వాతావరణం సరిగా లేకపోవడంతో ఎవరూ దానిని గుర్తించలేదు. దాదాపు సమీపానికి వచ్చేసిన తర్వాత.. రైలు డ్రైవర్ హారన్ మోగించడంతో అందరూ ఉలిక్కిపడ్డారు. సరిగ్గా అదేసమయంలో ట్రాక్ పై చంద్రబాబు సహా అధికారులు ఉన్నారు. ఆ వెంటనే అధికారులు పరుగు పరుగున ముందుకు వెళ్లి.. చేతులు ఊపుతూ.. రైలు డ్రైవర్‌ను అప్రమత్తం చేసే ప్రయత్నం చేశారు. ఇంతలో సమీపంలో ఉన్న ట్రాక్‌మెన్ ఎర్ర జెండా చూపడంతో.. డ్రైవర్ రైలును సెడన్ బ్రేకులు వేసి ఆపివేశారు.
సుమారు అరగంట సేపు.. తీవ్ర గందరగోళం చోటు చేసుకుంది. ఆ వెంటనే చంద్రబాబు ట్రాప్ పక్కనే ఉన్న రెయిలింగ్ మీదకు వెళ్లి.. ట్రాక్ క్లియర్ చేయడంతో రైలు ప్రశాంతంగా వెళ్లిపోయింది. చంద్రబాబుకు పెను ముప్పు తప్పింది. అనంతరం.. చంద్రబాబు రైల్వే అధికారులకు సమాచారం ఇవ్వాలని.. అరగంట సేపు రైళ్లను ఆపాలని కోరారు. తర్వాత.. ఆయన బుడమేరు వరద ప్రవాహాన్ని పరిశీలించి.. దారిమళ్లంచేలా చర్యలు చేపట్టాలని.. ఆదేశించారు. అయితే.. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వరదల కారణంగా బుడమేరుకు మాత్రం వరద పోటు తప్పకపోవడం గమనార్హం.