ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్.. మూడు రోజుల పాటు పులివెందులలో పర్యటించారు. శనివారం ఉదయం ఆయన పులివెందులకు వెళ్లి.. సోమవారం సాయంత్రం తిరిగి వచ్చారు. మరి ఈ మూడు రోజుల్లో ఆయన సాధించిందేంటి? అంటే.. కేవలం వైఎస్ వర్థంతిని పురస్కరించుకుని ఆయన నివాళులు అర్పించేందుకు ఇడులపాయకు వెళ్లినట్టు తెలుస్తోంది. కానీ, పర్యటనకు వెళ్లే ముందు మాత్రం ప్రజల నుంచి వినతులు తీసుకునేందుకు, వారి సమస్యలు పరిష్కరించేందుకు.. అని పార్టీ కార్యాలయం ప్రకటించింది. దీంతో ప్రజలు సమస్యలు తీసుకుని వస్తారని అందరూ అనుకున్నారు.
స్తానికంగా కూడా వైసీపీ నాయకులు ఇదే ప్రచారం చేసుకున్నారు. జగన్ వస్తున్నారని స్థానిక సోషల్ మీడియాల్లో పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. కానీ, తీరా చూస్తే.. పెద్ద ఎత్తున ప్రజలేమీ జగన్ పర్యటనకు పోటెత్తలేదు. గత రెండు మాసాల ముందు ఎవరైతే వచ్చారో.. వారిలో సగం మంది తాజాగా మరోసారి జగన్‌ను కలుసుకున్నారు. వారి సమస్యలు చెప్పుకొన్నారు. గతంలో ఇచ్చిన అర్జీల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. దీంతో జగన్ కొంత మేరకు హర్ట్ అయ్యారనే చెప్పాలి. ఎందుకంటే.. గతంలో ఉన్నంత ఊపు కానీ.. తాను వస్తుంటే.. లభించే ఘన స్వాగతాలు కానీ ఇప్పుడు లభించలేదు.
పైగా.. జగన్‌ను కలిసేందుకు కొత్తగా వచ్చిన వారు కూడా లేకపోవడం మరో కారణం. ఇదిలావుంటే.. వైసీపీ నాయకులు కూడా పెద్దగా జగన్‌ను కలుసుకునేందుకు ఆసక్తి చూపించలేదు. గతంలో తాము చేసిన పనులకు బిల్లులు రాలేదని చాలా మంది జగన్‌ను కలుసుకుని ఫిర్యాదులు చేశారు. అదేసమయంలో సొమ్ముల కోసం నిలదీతలు కూడా కనిపించాయి. కానీ, ఈ సారి మాత్రం ఆ తరహా పరిస్థితి కనిపించలేదు. ఎందుకంటే.. సర్కారు చాలా వరకు నిధులు, బకాయిలు ఇచ్చేసింది. దీంతో వారు కూడా.. జగన్‌తో పనిలేదని అనుకున్నారేమో.. జగన్‌ను విష్ చేసేందుకు కూడా పెద్దగా ఉత్సాహం చూపించలేదు. మొత్తంగా జగన్ ఈ మూడు రోజుల పులివెందుల పర్యటనలో సాధించింది ఏమీ లేదు. ఒక్క నివాళి తప్ప!!