మ‌హేష్‌కే తెలంగాణ పీసీసీ పీఠం!

దాదాపు ఆరు మాసాలుగా ఊరిస్తున్న తెలంగాణ‌కాంగ్రెస్ పార్టీ చీఫ్ ప‌ద‌విని కాంగ్రెస్ అధిష్టానం ఖ‌రారు చేసింది. అయితే.. దీనిపై ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది. ఈ ప‌ద‌విని ఆది నుంచి బీసీల‌కు ఇస్తార‌న్న ప్ర‌చారం జ‌రిగిన‌ట్టుగానే .. సీనియ‌ర్ నాయ‌కుడు పార్టీకి వీర విధేయుడు.. బొమ్మ‌ మ‌హేష్ గౌడ్ కు ఇచ్చిన‌ట్టు ఢిల్లీ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఈ పీటం కోసం.. సుమారు న‌లుగురు కీల‌క నాయ‌కులు పోటీ ప‌డ్డారు. వీరిలో ఎస్సీ, ఎస్టీ సామాజిక వ‌ర్గాల‌కు చెందిన నాయ‌కులు కూడా ఉన్న విష‌యం తెలిసిందే.

అయితే.. అనేక కూడిక‌లు. తీసివేత‌ల త‌ర్వాత‌.. రాష్ట్రంలో బ‌లంగా ఉన్న గౌడ సామాజిక వ‌ర్గాన్ని త‌మ వైపు తిప్పుకొనేందుకు కాంగ్రెస్ పార్టీ అదే సామాజిక వ‌ర్గంలో బ‌ల‌మైన నాయ‌కుడిగా ఉన్న మ‌హేష్ కు మొగ్గు చూపిన‌ట్టు తెలుస్తోంది. ఇక‌, దీనిపై ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది. ఇక‌, మహేష్ గౌడ్ 1966 ఫిబ్రవరి 24న నిజామాబాద్ జిల్లాలో జన్మించారు. విద్యార్థి దశ నుంచే కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్‌గా ఉన్నారు. 1986లో నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా, జాతీయ యువజన కాంగ్రెస్ కార్యదర్శిగా పని చేశారు.

అయితే.. మ‌హేష్‌గౌడ్ ఇప్ప‌టి వ‌ర‌కుప్ర‌జాక్షేత్రంలో విజ‌యం ద‌క్కించుకోలేక పోయారు. ఆయ‌న 1994లో డిచ్‌పల్లి నుంచి 2014లో నిజామాబాద్ అర్బన్ నుంచి పోటీ చేసినా విజ‌యం సాధించ‌లేదు. అయితే.. పార్టీలో మాత్రం ఆయ‌నకు బ‌ల‌మైన ప‌ట్టుంది. మంచి నాయ‌క‌త్వ ల‌క్ష‌ణాలు కూడా ఉన్నాయి. ఈ నేప‌థ్యంలోనే 2023లో తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ ఎన్నికల కమిటీలో సభ్యుడిగా నియమితుల య్యారు.తాజాగా పీసీసీ పీఠం అందుకున్నారు.

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్య‌వ‌హారాల ఇంచార్జ్ గా ఉన్న దీపాదాస్ మున్షీని కూడా.. మార్పు చేసిన‌ట్టు తెలిసింది. ఈయ‌న‌ స్థానంలో ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం భూపేష్ భఘేల్‌ని నియమించనున్నట్లు స‌మాచారం. అదేవిధంగా కేర‌ళ‌, ప‌శ్చిమ బెంగాల్ రాష్ట్రాల పీసీసీ చీఫ్‌ల నియామ‌కంలోనూ మార్పులు చోటు చేసుకున్నాయి. వీటిపై ప్ర‌క‌ట‌నే రావాల్సి ఉంది.