ప్రజలకు సేవ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. తాజాగా అన్నమయ్య జిల్లాలోని మైసూరువారిపాలెం గ్రామంలో నిర్వహించిన గ్రామ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆ గ్రామానికి సంబంధించిన అభివృద్ధి పనులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం.. గ్రామస్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా తన రాజకీయ ప్రస్థానంపై పవన్ స్పందించారు. తాను పనిచేసేందుకు, ప్రజల కష్టాలు తీర్చేందుకే రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు.
“ప్రజలకు ఏదైనా చేయాలన్న నిబద్ధత ఉంది. అసవరమైతే.. వారి కోసం కూలీగా మారేందుకు నేను సిద్ధం. నేను నిరంతరం.. ప్రజల కోసమే పనిచేస్తున్నా. వారికి కష్టమొస్తే.. అండగా ఉన్నా. ఈ రోజు డిప్యూటీ సీఎం పదవిలో ఉన్నా.. కానీ, నాకు ప్రజలే ముఖ్యం. పదవులు ముఖ్యం కాదు“ అని పవన్ తేల్చి చెప్పారు. చంద్రబాబు వంటి దూరదృష్టి(విజన్) ఉన్న నాయకుడి దగ్గర పనిచేయడం సంతోషంగా ఉందన్నారు. తాను ఎంతో నేర్చుకుంటున్నానని తెలిపారు.
చంద్రబాబు వల్లే.. లక్షల మందికి ఒకే ఒక్కరోజులో పింఛన్లు ఇవ్వగలుగుతున్నామని పవన్ వ్యాఖ్యానిం చారు. అప్పుల నుంచి అభివృద్ధి దిశగా రాష్ట్రాన్ని ముందుకు నడిపించగల శక్తి ఒకే ఒక్క చంద్రబాబుకు మాత్రమే ఉందని వ్యాఖ్యానించారు. “నాకంటే బాగా ఆలోచించ గలిగేవాళ్ల వెంట నడిచేందుకు నేనేమీ సంకోచించను. పాలనానుభవం ఉన్న చంద్రబాబు వద్ద నేర్చుకోవాలనే తపన నాకుంది“ అని పవన్ తేల్చి చెప్పారు.
త్వరలో గూండా నిరోధక చట్టం
త్వరలోనే గూండా నిరోధక చట్టం తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు పవన్ కల్యాణ్ చెప్పారు. రాష్ట్రంలో కొందరు చేస్తున్న ఆగడాలు.. భూకబ్జాలను ఎదుర్కొనేందుకు ఈ చట్టాన్ని తీసుకురానున్నట్టు తెలిపారు. రాయలసీమలో వలసలు ఎక్కువగా ఉన్నాయన్న పవన్ కల్యాణ్.. వాటిని అరికట్టేందుకు త్వరలోనే `నైపుణ్యాభివృద్ది విశ్వవిద్యాలయాన్ని` తీసుకురానున్నట్టు తెలిపారు. దీనిద్వారా.. గ్రామీణులకు శిక్షణ ఇచ్చి.. ఇక్కడే ఉపాధి మార్గాలు వెతుక్కునేలా చేస్తామని చెప్పారు.