పశ్చిమబెంగాల్ రాజధాని కోల్‌కతాలోని ఆర్ జీ కర్ ఆసుపత్రిలో జూనియర్ వైద్యురాలిపై జరిగిన దారుణ హత్యాచార ఘటన తర్వాత.. ఆమె శవాన్ని మాయం చేయాలని ఈ ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు భావించారా? అనంతరం.. అసలు ఈ ఘటనపై సర్కారు పెద్దలే.. మృతురాలి తల్లిదండ్రులకు వాస్తవాలు చెప్పకుండా కప్పిపుచ్చే ప్రయత్నం చేశారా? ఆధారాలు లేకుండా ధ్వంసం చేయాలన ఇకూడా ప్రయత్నించారా? అంటే.. ఔననే చెబుతోంది.. సీబీఐ నివేదిక.
కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటన పై క్షేత్రస్థాయిలో విచారణ జరిపిన సీబీఐ అధికారులు తాజాగా.. ప్రాథమిక నివేదికను సుప్రీంకోర్టుకు అందించారు. ఈ వ్యవహారంలో తెరవెనుక చోటు చేసుకున్న ఘటన లను నివేదికలో పేర్కొన్నారు. హత్యాచారం అనంతరం.. శవాన్ని మాయం చేయాలని భావించారని తెలిపారు. ఈ కేసును కప్పిపుచ్చే ప్రయత్నం చేశారని, కనీసం బాధితురాలి తల్లిదండ్రులకు కూడా విషయాన్ని చెప్పలేదని, స్పృహ కోల్పయి పడిపోయిందని.. మాత్రమే పోన్‌లో సందేశం ఇచ్చారని నివేదికలో స్పష్టం చేశారు.
దేశాన్ని సైతం కుదిపేసిన హత్యాచార ఘటనపై సీబీఐ మధ్యంతర లేదా ప్రాధమిక రిపోర్టును సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టుకు సమర్పించారు. దీనిని పరిశీలించిన సుప్రీంకోర్టు.. స్థానిక పోలీసు లు, కళాశాల యాజమాన్యం వ్యవహరించిన తీరును తీవ్రంగా ఆక్షేపించింది. పోలీసులు రాజకీయ నేతల ఒత్తిళ్లకు తలొగ్గారని స్పష్టమవుతున్నట్టు ధర్మాసనం పేర్కొంది. శవాన్ని అంత్యక్రియలకు అప్పగించేసిన తర్వాత.. ఎఫ్ ఐఆర్ నమోదుచేయడం ఏంటని ప్రశ్నించింది.
హత్యాచార ఘటన జరిగిన ప్రాంతంలో మౌలిక సదుపాయాల కల్పన పేరిట నిర్మాణాలు చేపట్టడాన్ని కూడా సుప్రీంకోర్టు తప్పుబట్టింది. ఇదిలావుంటే.. దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తున్న వైద్యులు.. సదరు నిరసనలను తక్షణమే విరమించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. విధుల్లో పాల్గొంటూనే నిరసన వ్యక్తం చేయొచ్చని పేర్కొంది. అయితే.. తమకు న్యాయం చేసేందుకు హామీ ఇవ్వాలన్న వైద్యుల తరఫు న్యాయవాదిపై ధర్మాసనం అసహనం వ్యక్తం చేయడం గమనార్హం.
Gulte Telugu Telugu Political and Movie News Updates