తెలంగాణ సీనియర్ రాజకీయ నేతగా సుపరిచితుడు..ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షులుగా వ్యవహరించిన ఆయన ఆచితూచి అన్నట్లుగా మాట్లాడతారు. మిగిలిన వారి మాదిరి తొందరపడటం ఆయనకు అలవాటు ఉంటుంది. అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ.. ఎప్పుడేం మాట్లాడాలన్న విషయం మీద పక్కా క్లారిటీతో వ్యవహరించటం కనిపిస్తుంది. తాను అన్న మాటల్ని.. అనలేదని.. మీడియాలో తప్పుగా రాసిందన్న ఆరోపణలు డీఎస్ దగ్గర కనిపించవు.
తెలంగాణ కాంగ్రెస్ లో సీనియర్ స్థానం నుంచి అనూహ్యంగా టీఆర్ఎస్ లోకి వెళ్లిన ఆయనకు.. ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుందని.. పెద్ద పీట వేస్తారన్న అంచనాలు తారుమారు అయ్యాయి. కొంతకాలంగా మౌనంగా ఉంటున్న ఆయన తాజాగా ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆసక్తికర అంశాల్నివెల్లడించారు.
తెలంగాణ కాంగ్రెస్ పార్టీని బలహీనం చేసేందుకు వీలుగా టీఆర్ఎస్ అధినేత.. ముఖ్యమంత్రి కేసీఆర్ తనను ట్రాప్ చేశారంటూ ఘాటు విమర్శ చేశారు. అంతేకాదు.. అసెంబ్లీ ఎన్నికల ముందు తనపై కేసీఆర్ కు కవిత ఫిర్యాదు చేసిన విషయం నిజమేనన్నారు. తాను పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తీసుకోవాలని.. లేదంటే పిలిచి మాట్లాడాలన్నారు. కానీ.. అలాంటిదేమీ జరగలేదన్నారు.
మరి.. పార్టీలోనే ఉన్నారు కదా? అన్న ప్రశ్నకు బదులిస్తూ.. తాను ప్రగతిభవన్ పేరును కూడా మర్చిపోయినట్లు చెప్పారు. పార్టీని పట్టుకొని వేలాడితే అక్కడికి ఎప్పుడూ వెళ్లేవాడిని కదా? అన్న ఆయన.. గౌరవం లేని చోటుకు తాను వెళ్లనని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీని వీడటం దురదృష్టకరమన్న ఆయన.. కొంతమంది వ్యక్తులు.. పరిస్థితుల కారణంగా తాను ఆ నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చిందన్నారు.
కేసీఆర్ మనసులో ఏముందో తనకు తెలీదని.. తాను ఎవరికి నమ్మకద్రోహం చేయలేదన్న ఆయన.. టీఆర్ఎస్ కుటుంబ పార్టీగా మారిందన్నారు. తన కొడుకు కమ్ ఎంపీ అరవింద్ మొదట్నించి బీజేపీ అభిమాని అని పేర్కొన్నారు. తాను కాంగ్రెస్ లో ఉన్నప్పుడు అరవింద్ బీజేపీలో యాక్టివ్ గా లేరన్నారు. తనను అడిగే బీజేపీలో చేరారని.. తన పిల్లలకు తాను ఆ స్వేచ్ఛ ఇచ్చినట్లు చెప్పారు. కాంగ్రెస్ కు భవిష్యత్తు ఉందా? అన్న మాటను తాను ఒప్పుకోనని.. పరిస్థితులను బట్టి పార్టీ బలం మారుతుంటుందన్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates