జనసేన అధిపతి పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ సభ్యత్వం తీసుకోవాలంటే రూ. 500 చెల్లించాలని డిసైడ్ చేశారు. నిజానికి పార్టీ సభ్యత్వం తీసుకోవాలంటే ఇంత పెద్ద ఎత్తున డబ్బు చెల్లించాలంటే కష్టమేనేమో. ఎందుకంటే పార్టీ సభ్యత్వానికి రూ. 500 చెల్లించటం బహుశా ఏ పార్టీలోను లేదేమో. మరి ఏ పార్టీలోను లేని విధంగా జనసేనలోనే ఎందుకు పెట్టినట్లు ? ఎందుకంటే సభ్యత్వం తీసుకున్న వాళ్ళంతా కచ్చితంగా భవిష్యత్తుల్లో పార్టీకే ఓట్లు వేస్తారని, పార్టీ ఎజెండానే మోస్తారని.
ఇప్పటి వరకు పార్టీ సభ్యత్వం తీసుకున్న వాళ్ళల్లో చాలామంది మొన్నటి ఎన్నికల్లో జనసేనకు ఓటు వేయలేదు. తాము సినిమాల్లో పవన్ అభిమానులమే అయినా ఓటు మాత్రం వైసిపికే వేస్తామని చాలామంది బహిరంగంగానే చెప్పిన విషయం గుర్తుండే ఉంటుంది. జనసేనలో పార్టీ సభ్యత్వం ఏమిటో, ఓట్లు వైసిపికి వేయటం ఏమిటో ఎవరికీ అర్ధంకాలేదు. బహుశా ఈ విషయంలో పవన్ కు ఒళ్ళుమండిపోయుంటుంది. అందుకనే తాజాగా చేయబోయే మెంబర్ షిప్పు డ్రైవ్లో మాత్రం రూ. 500 చెల్లించాలనే నిబంధనను తెచ్చారు.
మెంబర్ షిప్ కాస్ట్లీ వ్యవహారం కాబట్టే ప్రయోగాత్మకంగా ఐదు నియోజకవర్గాల్లో చేయాలని డిసైడ్ చేశారు. తూర్పుగోదావరి జిల్లాలోని రాజోలు, నెల్లూరు రూరల్, శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురం, అనంతపురం, గుంటూరు నియోజకవర్గాల్లో సభ్యత్వ నమోదు చేస్తారు. ఇక్కడ వచ్చే స్పందన బట్టి ఒకసారి రివ్యు చేసుకుని ఫైల్ డెసిషన్ తీసుకుంటారు.
రూ. 500 పెట్టి సభ్యత్వం తీసుకున్న వాళ్ళే నిజమైన జనసైనికులని పవన్ అనుకుంటున్నట్లున్నారు. ఇంత డబ్బులు పెట్టి సభ్యత్వం తీసుకున్న వారు ఇక ఏ విషయంలో కూడా వేరే పార్టీ వైపు చూడరని పవన్ భావిస్తున్నట్లు అర్ధమవుతోంది. మరి పవన్ వ్యూహం ఏ మేరకు ఫలిస్తుందో తెలియాలంటే కొంత కాలం వెయిట్ చేయాల్సిందే. ఎందుకంటే ఐదు నియోజకవర్గాల్లో పైలెట్ ప్రాజెక్టు ఇంకా లాంచ్ కాలేదు. సభ్యత్వ నమోదు కార్యక్రమం మొదలైతే కానీ స్పందన తెలీదు కదా. చూద్దాం ఏమవుతుందో.