ఈ ప్ర‌యోగం సక్సెస్ అయితే.. బాబుకు తిరుగులేదుగా!

రాజ‌కీయాల్లో పార్టీల అధిష్టానాలు ప్ర‌యోగాలు చేయ‌డం అనే ప్ర‌క్రియ స‌ర్వ‌సాధార‌ణం. ఎప్ప‌టిక‌ప్పుడు మారుతున్న ప‌రిణామాల‌కు అనుగుణంగా మార్పుల‌ను సంత‌రించుకుంటూ.. ముందుకు సాగక‌పోతే.. పార్టీల ఉనికికే ప్ర‌మాదం పొట‌మ‌రిల్లే ప‌రిస్థితి రాష్ట్రాల్లోనే కాదు.. దేశంలోనూ ఉంది. అందుకే ఎప్ప‌టిక‌ప్ప‌డు న‌వీక‌ర‌ణ‌కు పార్టీలు ప్ర‌ధాన ప్రాధాన్యం ఇస్తున్నాయి. రాష్ట్రంలో మ‌రింత భిన్న‌మైన రాజ‌కీయ వాతావ‌ర‌ణం ఉంది. యువ నాయ‌కుడు, వైసీపీ అధినేత జ‌గ‌న్ సీఎంగా ఉన్నారు. ఆయ‌న మంత్రివ‌ర్గం స‌హా పార్టీలోనూ దాదాపు 70 శాతం మంది నాయ‌కులు, నాయ‌కురాళ్లు యువ‌తే!

ఈ ప‌రిస్థితి వైసీపీకి క‌లిసివ‌చ్చింది. ఇక‌, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీని ప‌రిశీలిస్తే.. మెజారిటీ అంతా 60 ప్ల‌స్ నేత‌లే ఉన్నారు. యువత ఉన్న‌ప్ప‌టికీ.. వారికి ద‌క్కుతున్న ప్రాధాన్యం మాత్రం అంతంత మాత్ర‌మే. దీంతో పార్టీ పుంజుకుంటున్న దాఖ‌లాలు క‌నిపించ‌డం లేదు. ఈ క్ర‌మంలో తాజాగా చంద్ర‌బాబు ప్ర‌యోగానికి సిద్ధ‌మ‌య్యారు. ఇప్ప‌టికే ఉన్న జిల్లాలు, మండ‌ల‌స్థాయి క‌మిటీలకు అద‌నంగా పార్ల‌మెంటు స్థాయి క‌మిటీల‌ను ఏర్పాటు చేస్తున్నారు. దీనికి సంబంధించి విధివిధానాలు కూడా సిద్ధ‌మ‌య్యాయి. రేపో మాపో క‌మిటీల‌ను ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంది.

అయితే, ఈ క‌మిటీలు స‌క్సెస్ అవుతాయా? ప‌్ర‌స్తుతం స‌ప్త‌చేత‌నావ‌స్థలో ఉన్న పార్టీకి జ‌వ‌స‌త్వాలు ఇస్తాయా? అనేది మీమాంస‌. రాష్ట్రంలో పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గాల ప్రాతిప‌దిక‌గా కొత్త‌గా పాతిక క‌మిటీలు వేయాల‌ని చంద్ర‌బాబు నిర్ణ‌యించారు. వీటి కూర్పు కూడా అయిపోయింది. ప్ర‌క‌ట‌నే త‌రువాయి. అయితే, సామాజిక వ‌ర్గాల వారీగా చూసుకున్నా..సీనియ‌ర్ల వారీగా చూసుకున్నా.. అసంతృప్తి పెల్లుకుబుకుతున్న క్ర‌మంలో.. ఎవ‌రినీ సంప్ర‌దించ‌కుండా..కేవ‌లం ఓ న‌లుగురు చెప్పిన‌ట్టు క‌మిటీలు వేశార‌నే వ్యాఖ్య‌లు అప్పుడే గుప్పుమంటున్నాయి.

పైగా జిల్లా క‌మిటీలు ఉన్నాయి. ఈ ఏడాది కాక‌పోయినా..రేపైనా.. పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గాల‌ను జిల్లాలుగా ఏర్పాటు చేస్తే.. ప్ర‌స్తుతం జిల్లా స్థాయిలో ఉన్న క‌మిటీలు ఆటోమేటిక్‌గా రద్ద‌వుతాయ‌నే విష‌యం అంద‌రికీ తెలిసిందే. అప్పుడు ఈ పార్ల‌మెంటు స్థానాలే జిల్లా క‌మిటీలుగా వ్య‌వ‌హ‌రిస్తారు. అంటే.. ప్ర‌స్తుతం జిల్లా క‌మిటీలు గుండుగుత్తుగా ర‌ద్ద‌యిపోతాయి. ఈ నాయ‌కులు ఖాళీ అవుతారు. కొత్త‌వారే కొత్త జిల్లాల్లో చ‌క్రం తిప్పుతారు. ఫ‌లితంగా పార్టీకి కొత్త‌నాయ‌క‌త్వం అందుబాటులోకి వ‌స్తుంది. ఇదీ బాబు వ్యూహం. కానీ, క్షేత్ర‌స్థాయిలో దీనిపై వ‌స్తున్న వ్య‌తిరేక‌త‌ను కూడా ఆయ‌న గ‌మ‌నించాలి. పైగా సామాజిక వ‌ర్గాల వారీగా కూడా అసంతృప్తిని చ‌ల్లార్చాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది. మ‌రి ఏం చేస్తారో చూడాలి.