అమ‌ర‌రాజా హెచ్చ‌రిక‌-కేటీఆర్ విన్న‌పం: రేవంత్ ఏం చేశారు?

తెలంగాణ‌లో స‌రికొత్త వివాదం తెర‌మీదికి వ‌చ్చింది. రెండేళ్ల కింద‌ట‌.. ఏపీలోని చిత్తూరు జిల్లాలో ఉన్న అమ‌ర‌రాజా బ్యాట‌రీల క‌ర్మాగారం(ఇది టీడీపీ మాజీ ఎంపీ గ‌ల్లా జ‌య‌దేవ్ కుటుంబానికి చెందింది) విడిభాగాల త‌యారీ కేంద్రాన్ని అప్ప‌ట్లో తెలంగాణ‌లో ఏర్పాటు చేసేందుకు ఒప్పందం చేసుకుంది. ఇది ఏపీలోనూ.. తెలంగాణ‌లోనూ.. రాజ‌కీయంగా అప్ప‌ట్లో దుమారం రేపింది. ఏపీలోని వైసీపీ ప్ర‌భుత్వం వేధింపుల వ‌ల్లే.. అమ‌ర‌రాజా కంపెనీ పొరుగురాష్ట్రానికి పోయింద‌ని టీడీపీ నాయ‌కులు విమ‌ర్శ‌లు గుప్పించారు. దీనిని బీఆర్ఎస్ త‌న‌కు అనుకూలంగా మార్చుకుంది.

ఈ రాజ‌కీయ దుమారం ఎలా ఉన్నా.. ఇప్పుడు మ‌రో కొత్త వివాదం తెర‌మీదికి వ‌చ్చింది. ప్ర‌స్తుతం తెలంగాణ‌లో ఉన్న రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్ర‌భుత్వం త‌మ‌కు స‌హ‌క‌రించ‌డం లేద‌న్న‌ది అమ‌ర‌రాజా ఆరోప‌ణ‌. ఈ క్ర‌మంలోనే గ‌ల్లా జ‌య‌దేవ్‌.. రేవంత్ రెడ్డి స‌ర్కారును హెచ్చ‌రిస్తున్న‌ట్టుగా వ్యాఖ్యానించిన‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. “మీరు ఇచ్చిన‌(గ‌త ప్ర‌భుత్వం) హామీల‌ను నెర‌వేర్చ‌క‌పోతే.. రాష్ట్రం నుంచి వెళ్లిపోతాం” అని గ‌ల్లా హెచ్చ‌రించిన‌ట్టు వ‌చ్చిన వార్త‌లు ఇప్పుడు రాజ‌కీయంగా చ‌ర్చ‌నీయాంశం అయ్యాయి. ఈ హెచ్చరిక‌లపై ప్ర‌భుత్వం ఎలాంటి స్పంద‌నా చూపించ‌లేదు.

కానీ, మాజీ మంత్రి అప్ప‌ట్లో అమ‌ర‌రాజా కంపెనీ తెలంగాణ‌లో ఏర్పాటు అయ్యేందుకు ప్రోత్స‌హించిన కేటీఆర్ మాత్రం స్పందించారు. రేవంత్‌రెడ్డి స‌ర్కారు.. రాజ‌కీయ క‌క్ష‌ల‌కు పోతోంద‌ని.. రాష్ట్రానికి క‌ట్ట‌బ‌డి తెచ్చిన పెట్టుబ‌డుల‌ను కూడా కాల‌రాస్తోంద‌ని ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేశారు. అంతేకాదు.. ప్ర‌భుత్వం మారినా.. గ‌త ప్ర‌భుత్వ విధానాల‌ను కొన‌సాగించాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. ఇలా చేయ‌క‌పోతే.. పెట్టుబ‌డి దారులు ఇక‌, రాష్ట్రానికి వ‌చ్చేందుకు సంకోచిస్తార‌ని కూడా కేటీఆర్ హెచ్చ‌రించారు. అదేస‌మయంలో కాంగ్రెస్ ప్ర‌భుత్వం పెట్టుబ‌డిదారుల‌ను గౌర‌విస్తుంద‌న్న న‌మ్మ‌కం త‌న‌కు ఉంద‌ని పేర్కొన్నారు. ప్ర‌స్తుతం ఈ వ్య‌వ‌హారం హాట్ హాట్‌గా సాగుతోంది.

అసలేంటీ పెట్టుబ‌డి

చిత్తూరు జిల్లాలో ఎప్పుడో 50 ఏళ్ల కింద‌ట ఏర్పాటు చేసిన అమ‌ర‌రాజా బ్యాట‌రీల కంపెనీ ఉత్త‌త్తికి సంబంధించిన మ‌రో ప్ర‌ధాన విభాగాన్ని తెలంగాణ‌లో 2022లో ఏర్పాటుకు అప్ప‌టి బీఆర్ఎస్ ప్ర‌భుత్వం ప‌చ్చ‌జెండా ఊపింది. హైద‌రాబాద్ శివారులో భూమిని కేటాయించేందుకు కూడా అంగీక‌రించింది. దీనికి విడ‌త‌ల వారీగా 9500 కోట్ల రూపాయ‌ల‌ను అమ‌ర‌రాజా పెట్టుబ‌డులుగా పెట్ట‌నుంది. అదేస‌మ‌యంలో స్థానికంగా ఉన్న యువ‌త‌కు 50 శాతం ఉద్యోగాలు క‌ల్పించాల‌న్న ష‌ర‌తుకు కూడా ఒప్పందం చేసుకుంది. అయితే.. భూముల కేటాయింపు విష‌యంలో ఇప్పుడున్న స‌ర్కారు త‌మ‌కు స‌హ‌క‌రించ‌డం లేద‌న్న‌ది అమ‌రరాజా ఆరోప‌ణ‌.