టీడీపీ బాటలోనే బీజేపీనే నడుస్తోందా? అంటే ఔననే అంటున్నారు పరిశీలకులు. తాజా ఎన్నికల్లో విజయం దక్కించుకున్న కూటమి పార్టీలు.. సర్కారు ఏర్పాటు చేసి ముందుకు సాగుతున్నాయి. ఈ క్రమంలో టీడీపీ దూకుడుగా ఉంది. ప్రజాదర్బార్ కార్యక్రమం ద్వారా ప్రజలకు చేరువైంది. వారంలో ఐదు రోజుల పాటు పార్టీకార్యాలయాల్లో ప్రజాదర్బార్ నిర్వహించడం ద్వారా సామాన్యులకు పార్టీ, ప్రభుత్వం రెండూ కూడా చేరువయ్యాయి.
దీనివల్ల ఇటు పార్టీకి, అటు ప్రభుత్వంలో టీడీపీకి కూడా మంచి పేరువస్తోంది. సాధారణ ప్రజల సమస్యలను అప్పటికప్పుడు పరిష్కరించడంలోనూ.. వాటికి ప్రత్యామ్నాయాలు చూపించడంలోనూ.. నాయకులు ముందుంటున్నారు. సీఎం చంద్రబాబు సైతం ఈ ప్రజాదర్బార్‌లో పాలుపంచుకుంటూ ప్రజల సమస్యలు పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక, మరో పార్టీ జనసేన కూడా ‘ప్రజావాణి’ పేరుతో పార్టీ కార్యాలయంలో వారానికి రెండు మూడు రోజులు ప్రజల నుంచి అర్జీలు తీసుకుంటున్న విషయం తెలిసిందే.
దీంతో బీజేపీ నేతలు అంతర్మథనంలో పడ్డారు. కూటమిలోని రెండు పార్టీలూ దూకుడుగా ఉంటే.. తాము వెనుకబడి పోతున్నామన్న భయం వారిలో కనిపిస్తోంది. దీంతో వారు కూడా ఇప్పుడు ప్రజల మధ్యకు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దీనిలో భాగంగా ‘వారధి’ పేరుతో మరో రెండు రోజుల్లో పార్టీ కార్యాలయాల్లో ప్రజలను కలుసుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి అర్జీలు తీసుకుని, వారి సమస్యలను ప్రభుత్వానికి వివరించి.. పరిష్కరించే ప్రయత్నం చేయనున్నారు.
మొత్తానికి టీడీపీ, జనసేనలతో బీజేపీ పోటీ పడుతోంది. కానీ, అసలు సమస్య ఏంటంటే.. రాష్ట్ర సమస్యల పరిష్కారం విషయంలో కేంద్రాన్ని ఒప్పించి నిధులు తీసుకువస్తే.. ఆ పోటీలో సక్సెస్ అయితే.. బీజేపీకి మంచి మార్కులు పడతాయి కానీ.. ఇలా అందరూ కలిసి ప్రజా సమస్యల పరిష్కారం పేరుతో కాలం గడిపేస్తే.. ప్రయోజనం ఏంటనేది ప్రశ్న.