వైసీపీకి హై ఓల్టేజ్ షాక్‌.. మాజీ మంత్రి రాజీనామా!

ఏపీ ప్ర‌తిప‌క్ష పార్టీ వైసీపీకి కోలుకోలేని విధంగా దెబ్బ త‌గిలింది. కీల‌క నాయ‌కుడు, కాపు సామాజిక వ‌ర్గంలో మంచి పేరున్న మాజీ మంత్రి ఆళ్ల నాని(ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్‌) వైసీపీకి తాజాగా రాజీనామా చేశారు. ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొంటున్న‌ట్టు పేర్కొన్నారు. బ‌లమైన సామాజిక వ‌ర్గంతోపాటు.. విన‌య‌శీలి, విధేయుడిగా కూడా నానీకి మంచి పేరుంది. 2019 ఎన్నిక‌ల్లో ఏలూరు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి విజ‌యం ద‌క్కించుకున్న నాని.. తొలి రెండున్న‌రేళ్ల‌పాటు వైద్య‌, ఆరోగ్య శాఖ మంత్రిగా ప‌నిచేశారు. త‌ర్వాత ఈ ప‌ద‌విని విడ‌ద‌ల ర‌జ‌నీకి ఇచ్చారు.

వాస్త‌వానికి నాని వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ప‌నిచేసిన స‌మ‌యంలో క‌రోనా దేశాన్ని కుదిపేసింది. ఈ క్రమంలో ఆయ‌న అలుపెరుగ‌ని సేవ చేశారు. ఎక్క‌డా చిన్న విమ‌ర్శ కూడా రాకుండా.. క‌రోనా బాధితుల‌ను ఆదుకునే ప్ర‌య‌త్నం చేశారు. దీనికిగాను.. ఆయ‌న కేంద్రం నుంచి అప్ప‌ట్లో ప్ర‌శంస‌లు కూడా అందుకున్నారు. ఇది త‌గ్గుముఖం ప‌ట్టింద‌నే లోగా.. సొంత నియోజ‌క‌వ‌ర్గం ఏలూరులో జ‌నాలు విష పూరిత వాయువు పీల్చి ప‌దుల సంఖ్య‌లో మృతి చెందారు.

దీంతో రేయింబ‌వ‌ళ్లు నాని అక్క‌డే ఉండి సేవ‌లు చేశారు. వైద్యం అందేలా.. ఉరుకులు ప‌రుగులు పెట్టా రు. అధికారుల‌తో పెట్టించారు కూడా. అయితే.. అలాంటి నానీని ఠంచ‌నుగా మంత్రి ప‌ద‌వి నుంచి జ‌గ‌న్ త‌ప్పించేశారు. నిజానికి ఆయ‌న‌ను కొన‌సాగించాల‌ని సొంత పార్టీ నాయ‌కులే చెప్పినా జ‌గ‌న్ వినిపించుకోలేద‌నే వాద‌న ఉంది. ఈ క్ర‌మంలోనే విడ‌ద‌ల ర‌జ‌నీకి పెద్ద పీట వేశారు. అయితే.. నాని ఎక్క‌డా ఎదురు మాట్లాడ‌లేదు. అధినేత చెప్పిందే వేదంగా భావించి ముందుకు సాగారు.

కాగా.. తాజాగా జ‌రిగిన ఎన్నిక‌ల్లో చివ‌రి నిముషం వ‌ర‌కు కూడా ఆయ‌న‌కు టికెట్ ఇస్తారా లేదా? అనే టెన్ష‌న్ కొన‌సాగింది. చివ‌ర‌కు టికెట్ ఇచ్చినా.. కూట‌మి హ‌వాలో ఆయ‌న కూడా ఓడిపోయారు. ఇక‌, అప్ప‌టి నుంచి బ‌య‌ట‌కు రాని నాని.. తాజాగా వైసీపీకే కాదు.. ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల‌కు కూడా దూరం అవుతున్న‌ట్టు పేర్కొన్నారు. కాపు సామాజిక వ‌ర్గంలో బ‌ల‌మైన నేత‌గా ఎదిగిన నాని.. వివాద ర‌హితుడు.. అంద‌రికీ కావాల్సిన వాడు కావ‌డం గ‌మ‌నార్హం.