తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఎక్కడా తగ్గట్లేదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడినా.. ఆయన ఓడిపోయిన విషయం తెలిసిందే. ఓడినా పైచేయి నాదే అన్నట్టుగా ఆయన రాజకీ యాల్లో దూకుడుగా ఉంటున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న ట్రెండ్ ఇదే కావడంతో ఆయన వైఖరిని తప్పుపట్టాల్సిన అవసరం లేదు. ఓడిపోయి.. ఇంట్లో కూర్చోవడం కంటే.. బయటకు వచ్చి.. గెలిచిన నాయకుడి మాదిరిగా జగ్గారెడ్డి రాజకీయాలు చేస్తున్నారు.
ఎక్కడ ఏసమస్య ఉన్నా.. వెంటనే రియాక్ట్ అవుతున్నారు. సమస్యను ప్రస్తావిస్తూ.. కేసీఆర్ పైనా, బీఆర్ ఎస్ పార్టీపైనా నిప్పులు చెరుగుతున్నారు. ఇదేసమయంలో పార్టీలో పదవుల విషయాన్ని కూడా వదిలి పెట్టడం లేదు. పీసీసీ చీఫ్ పోస్టు త్వరలో ఖాళీ అవుతుందని వార్తలు వచ్చిన నాటి నుంచి మరింత రేంజ్‌లో జగ్గారెడ్డి రియాక్ట్ అవుతున్నారు. తనను తాను హైలెట్ చేసుకుంటున్నారు. గతాన్ని తవ్వి మరీ పార్టీకి తనేంటో గుర్తు చేస్తున్నారు. పార్టీ కోసం కొట్లాడినం.. అంటూ కొన్నాళ్ల కిందట వ్యాఖ్యానించారు.
ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో సబిత వర్సెస్ రేవంత్ వివాదం తెరమీదికి వచ్చినప్పుడు కూడా.. రేవంత్ కు మద్దతుగా నిలిచి తనదైన శైలిలో సబితపై విమర్శలు గుప్పించారు. “పార్టీ పొమ్మందా? ఎందుకు పోయినవ్? పదవి ఇస్తానంటే పోయినవ్” అంటూ మాటల తూటాలు పేల్చారు. అంతేకాదు.. పార్టీ కష్ట కాలంలో ఉన్నప్పుడు ఆదుకొనుడు తెలియదా? అని నిలదీశారు. అంటే.. మొత్తానికి జగ్గారెడ్డి తనేంటో పార్టీ గుర్తించే వరకు వదిలి పెట్టడన్న చర్చకు దారితీసేలా వ్యవహరిస్తున్నారు.
తాజాగా మంత్రి దామోదర రాజనర్సింహ సంగారెడ్డి జిల్లాలో పర్యటించారు. ఈ పర్యటనకు వచ్చిన జగ్గారెడ్డి.. తాను దామోదరకు ఏమాత్రం తీసిపోనన్న విధంగా వ్యాఖ్యానించారు. తాను, దామోదర కలిసి మూడేళ్లు అప్పటి అధికార పార్టీ బీఆర్ ఎస్ కు చుక్కలు చూపించామని, అనేక ఉద్యమాలు చేశామని చెప్పారు. సంగారెడ్డిలో మెడికల్ కాలేజీ నిర్మాణం కోసం.. ఇరువురు కలిసి ఉద్యమించిన నాటి రోజులను ఆయన తెరమీదికి తెచ్చారు.
తామిద్దరూ ఆనాడు కలిసి పనిచేసినందుకే.. ఇప్పుడు మెడికల్ కాలేజీ సాకారం అయిందని తెలిపారు. మొత్తంగా ఈ గతాన్ని తవ్వుకోవడం చూస్తే.. జగ్గారెడ్డి తనదైన శైలిలో కాంగ్రెస్ పార్టీకి తన విలువను గుర్తు చేస్తున్నారని అంటున్నారు పరిశీలకులు. మరి ఇప్పటికైనా.. ఆయన మనసు తెలుసుకుని పార్టీ ఏదో ఒక పదవిని ఇచ్చేస్తే.. బాగుంటుందేమో!!