ఏపీ మాజీ సీఎం జగన్ పై నమోదైన అక్రమ ఆస్తుల వ్యవహారాలకు సంబంధించిన కేసులు ఇప్పట్లో తేలే లా కనిపించడం లేదు. తాజాగా సుప్రీంకోర్టులో జరిగిన విచారణలో సీబీఐ తరఫు న్యాయవాది దాఖలు చేసిన అఫిడవిట్‌లోను.. తర్వాత వినిపించిన వాదనల్లోనూ ఈ విషయం స్పష్టంగా అర్థమైంది. జగన్ కేసుల్లో నిందితులుగా ఉన్న చాలా మంది ఇప్పటికే డిశ్చార్జ్(తమకు, ఈ కేసులకు సంబంధం లేదని.. తమను ఈ కేసుల నుంచి తొలగించాలని కోరుతూ వేసే పిటిషన్లు) పిటిషన్లు వేశారు.
ఇలా.. మొత్తం 93 మంది నిందితులుగా ఉన్న వారు డిశ్చార్జ్ పిటిషన్ లు దాఖలు చేశారు. వీటి వల్లే కేసులు ఆలస్య మవుతున్నాయని సీబీఐ తరఫున న్యాయవాదులు పేర్కొన్నారు. సాధారణంగా ఇలాంటి కేసుల్లో డిశ్చార్జ్ పిటిషన్లు కామనే. అయితే.. ఈ కేసుల్లో మరిన్ని ఎక్కువగా నమోదయ్యాయి. ఇప్పుడు వీటిని ముందు తేల్చాల్సి ఉంటుంది. ఈ విషయాన్నే సీబీఐ తెలిపింది. డిశ్చార్జ్ పిటిషన్లు దాఖలయ్యాయని, ఇంకా వేస్తూనే ఉన్నారని పేర్కొంది.
ఈ పిటిషన్లపై విచారణ ముందుకు సాగి.. నిందితుల ప్రమేయం లేదని తేల్చేందుకు సమయం పడుతుందని సీబీఐ తన అఫిడవిట్‌లో పేర్కొంది. దీనినే సుప్రీంకోర్టు.. ‘మాకు ఆశ్చర్యం కలిగిస్తోంది’ అని వ్యాఖ్యానించింది. ఇక్కడ సుప్రీంకోర్టు ఉద్దేశం .. డిశ్చార్జ్ పిటిషన్లపై కాదు.. అసలు విచారణ మందగిస్తున్న విధానం పైనే. అయినప్పటికీ.. విచారణను ముందుకు తీసుకువెళ్లాలని మాత్రం కోర్టు తేల్చి చెప్పింది. కానీ, దీనిని డిశ్చార్జ్ పిటిషన్లను దూరంగా పెట్టి విచారించే పరిస్థితి లేదు.
ఈ వాదనలే సీబీఐ కూడా వినిపించింది. ఆ 93 డిశ్చార్జ్ పిటిషన్లను విచారించేందుకు మరో ఐదారేళ్లు ఈజీగా పడుతుంది. కనీసం ఏడాదికి 30 డిశ్చార్జ్ పిటిషన్లను తేల్చినా.. మూడేళ్లు పడుతుంది. వారిని విభేదిస్తూ.. సీబీఐ మళ్లీ రివ్యూ పిటిషన్లు వేస్తే.. మరికొన్నేళ్లు పడుతుంది. ఇదే రాబోయే రోజుల్లో జరగనుంది. ఈ విషయాన్ని చెప్పకనే చెప్పినప్పటికీ.. సుప్రీంకోర్టు ప్రధాన పిటిషన్‌పై విచారణ చేయాలని ఆదేశించింది. దీనికి సమాధానం చెప్పేందుకు గడువు కోరారు. దీంతో మొత్తంగా చూస్తే..జగన్ కేసులు ఇప్పట్లో తేలేలా లేవని స్పష్టమైంది.