‘నీ అమ్మ, తోలు తీస్తా, బయట తిరగనియ్య ఏమనుకుంటున్నారు రా’ ఈ మాటలు ఎక్కడో కాదు. సాక్షాత్తూ శాసనసభలో బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్న మాటలు శాసనసభలో ఉద్రిక్తతకు దారితీశాయి.
బీఅర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ లో చేరిన దానం మీద స్పీకర్ వద్ద అనర్హత వేటు పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో శాసనసభలో మాట్లాడేందుకు మైక్ ఇవ్వడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో దానం అభ్యంతరకర భాషలో మాట్లాడారు. దీనిని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ తప్పుపట్టారు.
ఈ సందర్భంగా బీఅర్ఎస్ ఎమ్మెల్యేలు పోడియం ముందు బైఠాయించారు. దీంతో దానం వారిపై దాడికి యత్నించాడు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆది శ్రీనివాస్, పద్మావతులు అడ్డుకోవడంతో వెనక్కితగ్గాడు. రికార్డులు పరిశీలించి వ్యాఖ్యలు తొలగిస్తామని స్పీకర్ హామీ ఇవ్వడంతో వివాదం అప్పటికి సద్దుమణిగింది.
కాంగ్రెస్ పార్టీలో సుధీర్ఘకాలం ఉండి ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన దానం 2018 జూన్ 23న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలో చేరాడు. 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున ఖైరతాబాద్ శాసనసభ నియోజకవర్గం నుండి పోటీచేసి బీజేపీ అభ్యర్థి చింతల రామచంద్ర రెడ్డిపై 28,396 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు.
2023 ఎన్నికల్లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా మరోసారి గెలిచి 2024 మార్చి 17న కాంగ్రెస్ పార్టీలో చేరాడు. లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయాడు.
Gulte Telugu Telugu Political and Movie News Updates