అధికారంలో ఉన్న నాయకులకు.. ఒక ఐడియా రావడం వరకు బాగానే ఉంటుంది. కానీ.. దానిని అమలు చేసేందుకు, ముఖ్యంగా ప్రజలను ఒప్పించేందుకు మాత్రం ఒకింత కష్టపడాలి. అలా చేయకపోతే.. ఎంత మంచి పథకైనా.. ఎంత మంచి నిర్ణయమైనా.. ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ప్రజల్లో పలుచన కూడా అయ్యేలా చేస్తుంది. ఇప్పుడు ఇలా ఎందుకు చెప్పాల్సివస్తోందంటే.. సీఎం చంద్రబాబు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. సరికొత్త ఐడియాతో ముందుకు వచ్చారు.
అదే.. పీపీపీ విధానంలో రాష్ట్ర, జిల్లా స్థాయి ప్రధాన రహదారులను డెవలప్ చేయడం. గత వైసీపీ పాలన లో రహదారుల దుస్థితిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. కనీసం రోడ్లకు మరమ్మతులు కూడా చేయ డం లేదని ప్రజలు విమర్శలు గుప్పించారు. తిట్టిపోశారు. మంత్రులు, ఎమ్మెల్యేలను కూడా నిలదీశారు. కానీ.. జగన్ సర్కారు లైట్ తీసుకుంది. వచ్చిన నిధులు.. చేసిన అప్పులు అన్నీ కూడా.. పథకాలకు వెళ్లిపోతున్నాయని చెప్పినా.. ప్రజలకు అర్థమయ్యేలా చెప్పలేక పోయారు.
ఫలితంగా వైసీపీ ఘోర పరాజయం మూటకట్టుకున్న అనేక కారణాల్లో రహదారులు కూడా ఒకటి. ఇప్పుడు వాటిని సంస్కరించాలని.. అందమైన రహదారులు వేయడం ద్వారా ప్రజల మనసుల్లోనిలిచిపోవాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఇంత వరకు మంచిదే. అయితే.. ఇప్పుడు నిధులు లేని కారణంగా.. రహదారులను నిర్మించే పరిస్థితి లేకుండా పోయింది. అలాగని తప్పించుకునే అవకాశం లేదు. దీంతో చంద్రబాబు సరికొత్త ఐడియా వేశారు. పీపీపీ విధానంలో రహదారులు నిర్మించాలని నిర్ణయించారు.
పీపీపీ అంటే.. పబ్లిక్-ప్రైవేట్-పార్టనర్ షిప్. ఈ విధానంలో ప్రభుత్వం నూటికి 10 రూపాయలు వెచ్చిస్తుంది. మిగిలిన మొత్తాన్ని కాంట్రాక్టరు సంస్థ భరించాల్సి ఉంటుంది. తాము చెప్పిన నాణ్యతా ప్రమాణాల మేరకు.. రోడ్లు నిర్మిస్తారు. మరి ఆ 90 రూపాయల నిధుల మాటేంటి? అంటే.. నెమ్మదిగా ప్రజల నుంచి వసూలు చేసుకోవడమే. దీనికి గాను.. నిర్మించబోయే రాష్ట్ర, జిల్లా స్థాయి రహదారులపై టోల్ గేట్లు పెడతారు. నేషనల్ హైవేపై ఎలా అయితే.. టోల్ వసూలు చేస్తున్నారో.. అలానే వసూలు చేస్తారు. కాకపోతే ఎలాగూ బైకులు, ఆటోలు, ట్రాక్టర్లకు మినహాయింపు ఉంటుంది. కేవలం కార్లు, కమర్షియల్ వాహనాలకు మాత్రమే టోల్ వసూలు చేస్తారు.
గతంతో పోలిస్తే ఇపుడు ప్రజలు దీనిని స్వాగతించే అవకాశమే ఉంది. ఎందుకంటే టోల్ ఎలాగూ సామాన్యులపై పడే భారం తక్కువ. పైగా రోడ్లు బాగుంటే ప్రజల సమయం వృథా కాదు, త్వరగా గమ్యస్థానాలకు చేరుకుంటారు. వ్యాపారం పెరుగుతుంది, వాహనాలు కూడా ఎక్కువ కాలం మన్నిక వస్తాయి. రిపేర్లు బాగా తగ్గుతాయి.
కమర్షియల్ వాహనాలకు ప్రయాణ వేగం బాగా తగ్గడం వల్ల వారి వ్యాపారం మరింత లాభసాటి అవుతుంది. ఇక కార్ల వినియోగదారులకు కూడా సాఫీ ప్రయాణం ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే… ప్రజలు కూడా టోల్ తీసుకున్నా పర్లేదు మంచి రోడ్లు ఉంటే చాలు అనే స్థాయికి వచ్చారు. ఎందుకంటే రోడ్లు బాలేకపోతే అదెంత నరకమో, ఎంత ప్రమాదకరమో గత ఐదేళ్లలో ప్రజలు అనుభవించారు. అందుకే దీనికి ప్రజామోదం సులువుగా లభిస్తుందని అనుకోవచ్చు.
అయితే, దీనిని ప్రతిపక్ష పార్టీలు రాజకీయం చేసే అవకాశం లేకపోతే… కానీ ప్రజల మైండ్ సెట్ మారిన ద్రుష్ట్యా ఇపుడు అదంత పెద్ద సమస్య కాకపోవచ్చు.