ఏపీ రాజకీయాల్లో చిత్రమైన వ్యవహారాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఒకవైపు పాలన సాగిస్తూనే మరోవైపు విపక్షం వైసీపీని కట్టడి చేసే విధంగా కూటమి ప్రభుత్వ నేతలు వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం జగన్ ఓడిపోయి.. ప్రతిపక్షంలో ఉన్నా.. ఆయనకు ప్రజల నుంచి వచ్చిన 37.86 శాతం(సభలో చంద్రబాబు చెప్పిన లెక్క) ఓట్లు మాత్రం రాజకీయంగా చర్చకు వస్తోంది. దీంతో ప్రజల్లో సానుభూతిని తగ్గించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఈ క్రమంలో ఇప్పటికే విడుదల చేసిన శ్వేతపత్రాల ద్వారా వైసీపీ విధ్వంస పాలన అంటూ.. ప్రచారం చేస్తున్నారు. ఇక, ఇప్పుడు తాజాగా గతంలో వైసీపీ హయాంలో రైతులు, ఇతర భూయజమాలకు సంబంధించి భూములు సర్వే చేసి వేసిన సర్వే రాళ్ల
వ్యవహారాన్ని కూడా ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు. అయితే.. ఈ విషయంలో మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీశాయి. వైసీపీ ప్రభుత్వ హయాంలో వేసిన సర్వే రాళ్లను ఆయన సమాధి రాళ్లతో పోల్చారు.
“మీ కందరికీ తెలుసుకదా! సమాధులు కట్టిన తర్వాత.. వాటిపై రాళ్లు వేసుకుని.. ఫొటోలు వేసుకుంటారు. ఇప్పుడు ఇలానే.. సర్వే రాళ్లపై జగన్ ఫొటోలు వేయించుకున్నాడు. సర్వేరాళ్లకు-సమాధి రాళ్లకు కూడా తేడా తెలియని ఒక దుర్మార్గుడు చేసిన పాపం ఖరీదు.. 700 కోట్లు” అని ఎక్స్ వేదికగా నిప్పులు చెరిగారు. గత వైసీపీ ప్రభుత్వం రైతుల పొలాల్లో సర్వే రాళ్లపై జగన్ ఫొటోలు వేయించిన విషయం తెలిసిందే. దీనిని అప్పటి గనుల శాఖ డైరెక్టర్ వెంకటరెడ్డి సూచించారని.. ఇటీవల కొందరు వైసీపీ నాయకులు చెప్పారు.
దీనివల్లే వైసీపీ ఘోరంగా ఓడిపోయిందని చెప్పుకొచ్చారు. దీనిని కోట్ చేస్తూ.. ఎన్నికల సమయంలో కూటమి పార్టీలు ప్రజలను చైతన్య పరిచాయి. ఇప్పుడు కూడాఇదే విషయాన్ని ప్రజల మధ్య చర్చకు వచ్చేలా చేస్తున్నారు. క్రమంలో రైతు తన పొలంలో దిష్టిబొమ్మ పెట్టడానికి ఒప్పుకుంటాడు. కానీ పొలం హక్కు పుస్తకాల మీద దిష్టిబొమ్మ పెడితే ఊరుకోడు. సమాధి రాళ్ల మీద ఫోటో వేసుకున్నట్లు సర్వే రాళ్లపై జగన్ ఫోటోలు వేయించాడు
అని అచ్చెన్న వ్యాఖ్యానించారు. దీనిపై వైసీపీ నాయకులు మండి పడుతున్నారు.