ఉదయం 8 గంటలు అయితే చాలు.. మంగళగిరిలోని లోకేశ్ నివాసం వద్ద కోలాహల వాతావరణం నెలకొంటోంది. ఆ మాటకు వస్తే.. ఈ హడావుడి ఉదయం ఆరు గంటల నుంచే షురూ అవుతుంది. వారంలో అన్ని రోజులు.. ఏ ఒక్కరోజును మినహాయించకుండా ప్రతి రోజూ తన దైనందిక చర్యల్లో ప్రజాదర్బార్ ను ఒక భాగంగా మార్చుకున్నారు ఏపీ మంత్రి నారా లోకేశ్. ముఖ్యమంత్రి చంద్రబాబు కుమారుడిగా.. మంగళగిరి ఎమ్మెల్యేగా.. మంత్రిగా వ్యవహరిస్తున్న ఆయన.. తాను చేస్తున్న పనిని లోప్రొఫైల్ గా ఉంచుకోవటం గమనార్హం.
సోషల్ మీడియాలో కొంత ప్రచారం చేసుకున్నా.. తాను చేస్తున్న రోజువారీ పని మీద అందరి ఫోకస్ పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్న లోకేశ్ ప్రజాదర్బార్ ఆసక్తికరంగా మారింది. తెలుగుదేశం పార్టీ మాత్రమే కాదు.. ఏపీలో అధికారపక్షంలోని కూటమి ప్రభుత్వంలో మరే నేత కూడా ఈ తరహా ప్రజాదర్బార్ ను రోజూ నిర్వహించట్లేదని చెబుతున్నారు. ఉదయం 8 గంటల నుంచి రెండు గంటల పాటు ఈ ప్రజాదర్బార్ సాగుతుందని.. తమ వద్దకు సమస్యలతో వచ్చే వారికి కొత్త ధైర్యాన్ని ఇచ్చి పంపుతున్న లోకేశ్ తీరు ఆసక్తికరంగా మారింది.
మొత్తంగా చూస్తే.. తొలిసారి మంగళగిరిలో ఎమ్మెల్యే పదవి కోసం పోటీ చేసి.. ఓటమిపాలు కావటం లోకేశ్ లో చాలానే మార్పునకు కారణమైందని చెప్పాలి. ఇటీవల ఎన్నికల్లో తిరుగులేని అధిక్యతను ప్రదర్శించిన లోకేశ్.. ప్రభుత్వ ఏర్పాటు మొదలు.. ప్రతి నిత్యం ప్రజాదర్బార్ ను నిర్వహిస్తున్నారు. ప్రచారం తక్కువ. ఫలితం ఎక్కువ ఉండేలా చూసుకోవటం.. లోప్రొఫైల్ మొయింటైన్ చేసుకోవటం.. కష్టంలో ఉన్న వారు ఎవరైనా సరే.. తనను కలిసేందుకు ప్రతి రోజు ఎదురుచూస్తుంటానన్న సందేశాన్ని తన ప్రజాదర్బార్ ద్వారా పంపారని చెప్పాలి.
క్యూ పద్దతిలో లోపలకు పంపటం.. అక్కడ ఏర్పాటు చేసిన కుర్చీల్లో కూర్చున్న వారి వద్దకే వెళుతున్న నారా లోకేశ్ లో కొత్త నాయకుడ్ని చూస్తున్నట్లుగా చెబుతున్నారు. మొత్తంగా చూస్తే.. లోకేశ్ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరి ప్రజల ప్రయోజనాలకు పరిమితం కాకుండా.. ఏపీ వ్యాప్తంగా ఎవరికి ఎలాంటి అవసరమైనా తనను కలవాలని ఎవరనుకున్నా.. వారికి తాను అందుబాటులో ఉంటానన్న భావనను కలుగజేయటంలో లోకేశ్ సక్సెస్ అయ్యారంటున్నారు. మొత్తానికి ప్రజాదర్బార్ తో సరికొత్త ఇమేజ్ ను లోకేశ్ మూటగట్టుకున్నారన్న మాట బలంగా వినిపిస్తోంది.