వైసీపీలో.. ఎవ‌రికి వారే య‌మునా తీరే?

వైసీపీ సీనియ‌ర్ నాయ‌కులు ఎవ‌రి దారిలో వారు ఉన్నారు. కొంద‌రు కూట‌మి స‌ర్కారుకు భ‌య ప‌డుతుం డ‌గా మ‌రికొంద‌రు.. వైసీపీ వ్య‌వ‌హార శైలినే త‌ప్పుప‌డుతున్నారు. ఎన్నిక‌ల ఫ‌లితం వ‌చ్చి 50 రోజులు అయిపోయినా.. జ‌గ‌న్ పుంజుకోక‌పోవ‌డంతో ఇక‌, తాము మాత్రం పార్టీని ఏం చేస్తామ‌న్న ఉద్దేశంలో చాలా మంది నాయ‌కులు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అనంత‌పురం నుంచి శ్రీకాకుళం వ‌ర‌కు.. ఎవ‌రూ ముందుకు రావ‌డం లేదు. నిత్యం మీడియాలో ఉండే వారు కూడా సైలెంట్ అయ్యారు.

ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు, త‌మ్మినేని సీతారామ్‌, దువ్వాడ శ్రీనివాస్‌, అనంత వెంక‌ట్రామిరెడ్డి, కాట‌సాని బ్ర‌దర్స్‌, బియ్య‌పు మ‌ధుసూద‌న్‌రెడ్డి.. ఇలా ఒక‌ప్పుడు మీడియా ముందు గొంతు చించుకుని మాట్లాడిన వారు కూడా.. ఇప్పుడు మైకు క‌నిపిస్తే.. మాయం అవుతున్నారు. నోరు విప్ప‌డం లేదు. కూట‌మిని కార్న‌ర్ చేయ డ‌మూ లేదు. దీనికి కార‌ణం.. కేసుల భ‌యం ఒక‌టైతే.. వ్యాపారాల బెంగ మ‌రొక‌టి. ఈ రెండు కార‌ణాల‌తో అసలు వైసీపీని వారు ప‌ట్టించుకోవ‌డం లేద‌న్న చ‌ర్చ సాగుతోంది.

ఇంకో వైపు.. పార్టీ అధికారంలో ఉన్న‌ప్పుడు త‌మ‌ను ప‌ట్టించుకోలేద‌న్న కార‌ణంగా .. అప్ప‌ట్లో రుస‌రుస‌లా డిన నాయ‌కులు కూడా ఇప్పుడు సైలెంట్ అయ్యారు. వీరంతా పార్టీలు మార‌తారా? లేక‌.. మౌనంగానే ఉంటారా? అనేది చెప్ప‌డం క‌ష్టం. కొంద‌రు జ‌గ‌న్‌కు విధేయులు ఉన్నారు. మ‌రికొంద‌రు స‌జ్జ‌ల బాధితు లు కూడా ఉన్నారు. ఇలాంటివారంతా ఇప్పుడు ఎవరి దారిలో వారు ఉన్నారు. వైసీపీ పిలిచినా.. త‌ల‌చినా.. క‌నిపించ‌డం లేదు.

ఇటీవ‌ల ఢిల్లీలో నిర్వ‌హించిన ధ‌ర్నాకు హాజ‌రు కావాలంటూ.. పార్టీ నుంచి పిలుపు వ‌చ్చింది. అయిన‌ప్ప టికీ.. కొంద‌రు కీల‌క నాయ‌కులే డుమ్మా కొట్టారు. దీంతో పార్టీలో చ‌ర్చ వ‌చ్చినా.. వారిని పిలిచి మంద‌లించే ప‌రిస్థితి లేదు. అస‌లు వారిని ఎక్క‌డ హెచ్చ‌రిస్తే.. ఎక్క‌డ పార్టీకి దూర‌మ‌వుతారోన‌ని.. కొంద‌రు సీనియ‌ర్లు చెబుతున్నారు. ప్రాంతానికొక నాయ‌కుడు లేదా జిల్లాకు ఒక నాయ‌కుడు మాత్ర‌మే ప్ర‌స్తుతం యాక్టివ్‌గా ఉన్నారు. మిగిలిన వారంతా మౌనంగానే ఉన్నారు. వారి దారిలో వారు న‌డుస్తున్నారు.