ఏపీలో కొత్త ట్రెండుకు శ్రీకారం చుట్టారు.. విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే, బీజేపీ నాయకుడు సుజనా చౌదరి. ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికై.. 45 రోజులు గడిచిన నేపథ్యంలో ఇప్పటి వరకు ఈ 40 రోజుల్లో ఏం చేశారో.. వివరిస్తూ.. నియోజకవర్గం వ్యాప్తంగా పోస్టర్లు, బ్యానర్లు ఏర్పాటు చేయించారు. వాస్తవానికి రాష్ట్రంలోనే కాదు.. దేశవ్యాప్తంగా కూడా.. ఎవరూ ఇప్పటి వరకు ఏ రోజు ఆరోజు.. తాము ఏం చేశామనే డైరీ.. కానీ, వారి వ్యవహారాలు కానీ. ఎప్పుడూ వివరించలేదు. మహా ఉంటే.. ఒకరిద్దరు మాత్రమే ఉంటారు.
కానీ, ఇప్పుడు కొత్తగా సుజనా చౌదరి తన ప్రోగ్రెస్ రిపోర్టును నియోజకవర్గంలో బ్యానర్ల ద్వారా విడుదల చేశారు. నియోజకవర్గంలో ఉన్న సమస్యలను ఏవేవి ఆయన పరిష్కరించారో ఈ సందర్భంగా వివరించారు. సుజనా చెప్పిన ప్రోగ్రెస్ ఇదే..
- విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని 39వ డివిజన్ లో కల్వర్టు పనుల పూర్తి.
- 41వ డివిజన్ గాలిబ్ షాహిద్ దర్గా ప్రాంతంలో డ్రైనేజీ సమస్యకు పరిష్కారం.
- ఊర్మిళ నగర్ మెయిన్ రోడ్డు రహదారి సమస్యకు పరిష్కారం.
- 42వ డివిజన్ లలిత నగర్‌లో మ్యాన్ హోల్ సమస్యకు పరిష్కారం.
- 45వ డివిజన్‌లో రోడ్డు మధ్యలో ప్రయాణీకులకు అడ్డుగా ఉన్న పోల్ తొలగించాం.
- 45వ డివిజన్‌లో తాగునీటి పైపులైన్లు కోసం తీసిన గోతులను పూడ్చివేయించాం.
- కేఎల్ రావు నగర్‌లో తాగునీటి సమస్యకు పరిష్కారం.
- 47వ డివిజన్‌లో తాగునీటి పైపులైన్లకు మరమ్మత్తులు.
- 47వ డివిజన్‌లో పారిశుధ్య సమస్యకు పరిష్కారం.
- విద్యాధరపురంలో ఎండిపోయిన చెట్లు తొలగించాం.
ప్రశంసలు – విమర్శలు..
- ఎమ్మెల్యే సుజనా వెలువరించిన ప్రోగ్రెస్ రిపోర్టుపై ప్రశంసలతోపాటు విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ప్రజల సమస్యలు పరిష్కరించడంలో సుజనా ముందున్నారని.. టీడీపీ నాయకులు ప్రశంసిస్తున్నారు. బీజేపీ నాయకులు మౌనంగా ఉన్నారు.
- సుజనా చౌదరి కార్పొరేటర్ స్థాయిలో ఆలోచన చేస్తున్నారని.. కమ్యూనిస్టు నాయకులు విమర్శించారు. ఆయన చేయించిన పనులు కార్పొరేటర్ స్థాయి పనులని.. ఎమ్మెల్యే స్థాయి పనులు కావని.. వాటిపై మునిసిపల్ఆ ఫీసుకు సాధారణ ప్రజలు ఫిర్యాదు చేసినా పరిష్కారం అవుతాయని అంటున్నారు.
ఆదర్శం అవుతారా?
ఇక, ఇప్పటి వరకు ఏ ఎమ్మెల్యే కూడా తన ప్రొగ్రెస్ ఇదీ.. అని ఎప్పుడూ ప్రకటించుకోలేదు. ఈ నేపథ్యంలో తొలిసారి వినూత్నంగా తన ప్రయత్నాన్ని ఆవిష్కరించారుసుజనా. ఈ క్రమంలో ఆయన ఆదర్శంగా నిలుస్తారా? ఈయనను చూసి మరింత మంది కూడా తమ ప్రోగ్రెస్‌ను వివరిస్తారా? అనేది చూడాలి.