ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ గురువారం కూడా అసెంబ్లీకి డుమ్మా కొట్టారు. సోమవారం ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తొలి రోజు వచ్చి.. హడావుడి చేసిన జగన్.. తర్వాత.. రోజు రాలేదు. ఆ వెంటనే ఢిల్లీలో ధర్నా ఉందంటూ.. అక్కడకు వెళ్లిపోయారు. తనతో పాటు తన పార్టీ ఎమ్మెల్యేలను కూడా తీసుకువెళ్లిపోయారు. దీంతో మంగళవారం, బుధవారం సభకు డుమ్మా కొట్టారు.
ఇక, ఢిల్లీలో కార్యక్రమాన్ని ముగించుకుని.. గురువారం ఉదయమే తాడేపల్లికి చేరుకున్నారు జగన్. అయినప్పటికీ.. గురువారం ఆయన సభకు రాకపోవడం గమనార్హం. గురువారం సభలో శాంతి భద్రతలపై శ్వేత పత్రం విడుదల చేస్తారన్న విషయం తెలిసి కూడా.. తన వారిని కూడా పంపించకుండా.. కాలక్షేపం చేశారు. తాడేపల్లిలోని తన నివాసంలో పార్టీ నాయకులతో భేటీ అయిన.. జగన్.. ధర్నా జరిగిన విధానంపై చర్చించారు. మున్ముందు చేపట్టే కార్యక్రమాలపై వారితో సూచనలు, సలహాలు పంచుకున్నారు.
అయితే.. జగన్ కనుక సభకు వచ్చి ఉంటే.. ఆయన వాయిస్ వినిపించేందుకు అవకాశం ఉండేది. మరోవైపు.. ప్రభుత్వం కూడా శ్వేతపత్రాలతో హుడావుడి చేస్తున్న నేపథ్యంలో జగన్ సభకుడుమ్మా కొట్టడం.. తన వారిని కూడా.. డుమ్మా కొట్టించడంతో సభలో చెబుతున్నవన్నీ కూడా.. వాస్తవాలేనని ప్రజలు విశ్వసించే అవకాశం మెండుగా ఉంటుంది. మరి.. ఇదే జరిగి.. ప్రజలు వాటిని విశ్వసిస్తే.. జగన్‌కు సొంత ఇమేజ్ మరింత దెబ్బతినే అవకాశం పెరుగుతుందని అంటున్నారు పరిశీలకులు.
ఇదిలావుంటే.. శాసన మండలిలో బలం ఎక్కువగా ఉన్నప్పటికీ.. వైసీపీ ఎమ్మెల్సీలు మండలికి కూడా రావడం లేదు. తొలి రోజు మాత్రమే వచ్చిన ఎమ్మెల్సీలు మరుసటి రోజు నుంచి గుడ్ బై చెప్పినట్టుగా వ్యవహరిస్తున్నారు. దీంతో వీరు కూడా.. లేక మండలి బోసిపోయినట్టు అయిపోయింది. ఉన్న 15 మంది ఎమ్మెల్సీలతోనే మండలి నడుస్తోంది. మంత్రులు తమ ప్రసంగాలను వారికే వినిపిస్తున్నారు. ఇలా అటు శాసన సభకు, ఇడు మండలికీ రాకపోవడంతో వైసీపీ ప్రాభవం మరింత తగ్గే ప్రమాదం ఉందని అంటున్నారు పరిశీలకులు.
Gulte Telugu Telugu Political and Movie News Updates