చంద్రబాబు అనుకున్నది సాధించారు. తాజాగా కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్‌ను గమనిస్తే.. కీలకమైన రంగాలుగా ఉన్న అమరావతి నిర్మాణానికి, పోలవరం ప్రాజెక్టుకు.. నిధులు రాబట్టారు. ప్రత్యక్షంగా అమరావతి నిర్మాణంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటన చేశారు. రూ.15 వేల కోట్లు ఇస్తామన్నారు. ఇదే సమయంలో పోలవరం ప్రాజెక్టుకు ఎలాంటి నిధులు ప్రకటించకపోయినా.. పూర్తి చేసేందుకు సాయం చేస్తామన్నారు. పార్లమెంటు సాక్షిగా చేసిన ప్రకటన కాబట్టి.. ఈ విషయంలో చంద్రబాబు పడిన తపన అయితే.. ఫలించింది.
ఇక, వెనుక బడిన జిల్లాలకు నిధులు.. అదేవిధంగా చంద్రబాబు ఆశిస్తున్న హైదరాబాద్-బెంగళూరు హైవే.. కు కూడా రంగం రెడీ అయింది. పారిశ్రామిక అభివృద్ధికి పెద్దపీట వేస్తామని నిర్మలా సీతారామన్ ప్రకటన చేశారు. మొత్తంగా చూస్తే.. కేటాయింపులు ఒక్క అమరావతికే ఉన్నట్టు కనిపిస్తున్నా.. అంతర్గతంగా మాత్రం చంద్రబాబు ఆశించిన మేరకు సఫలమయ్యారనే చెప్పాలి. గతంలో జగన్‌తో పోల్చుకుంటే.. చంద్రబాబు ఈ విషయంలో బెటర్ అనే భావన వ్యక్తమైంది.
నిజానికి బడ్జెట్ అంచనాల సమయంలోనే ప్రత్యేక హోదా అడగాలన్న ఒత్తిడి ఆయనపై వచ్చింది. అయితే.. కొంత తెలివిగా వ్యవహరించిన చంద్రబాబు ఎలానూ ఇవ్వని దానిని అడిగి లేదని అనిపించుకునే కంటే కూడా.. ఇతర అంశాల్లో సాధించుకుంటున్నామనే వుద్దేశంతోనే ఆయన ముందుకు కదిలారు. ఈ క్రమంలో పోలవరం పూర్తి బాధ్యతను కేంద్రంపైనే పెట్టేశారు. తాజాగా మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ప్రకటన వెనుక అంతరార్థం ఇదే. కాబట్టి.. పోలవరం విషయంలో చంద్రబాబు కలలు ఖచ్చితంగా నెరవేరుతాయి. అమరావతి కూడా పట్టాలకెక్కనుంది.
గతంలో జగన్ పాలనను గమనిస్తే.. ఏదో అడిగామని చెప్పుకొన్నా.. పెద్దగా రాష్ట్రానికి వచ్చిన నిధులు ఏమీలేవు. పైగా బీజేపీ బలంగా ఉండడం కూడా.. దీనికి కారణమనే చెప్పాలి. ఏదేమైనా.. గత ఐదేళ్లతో పోల్చుకుంటే.. ఏపీకి కొంత మేరకు అయినా.. చంద్రబాబు సాధించగలిగారనడంలో సందేహం లేదు. ఇదే విషయాన్ని కోట్ చేస్తూ.. మంత్రి నారా లోకేష్ స్పందించారు. పోలవరం నిర్మాణానికి సహాకారంతో పాటు.. అమరావతికి రూ.15 వేల కోట్ల రూపాయలు కేటాయిస్తామన్న నిర్మలమ్మ ప్రకటనపై హర్షం వ్యక్తం చేస్తూ.. ఐదు కోట్ల మంది ప్రజల పక్షాన ఆయన ధన్యవాదాలు తెలిపారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates