అన్నమయ్య జిల్లా మదనపల్లెలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన అగ్నిప్రమాదం.. ప్రమాదవ శాత్తు జరిగిన ఘటన కాదని ఏపీ డీజీపీ ద్వారకా తిరుమల రావు పేర్కొన్నారు. దీని వెనుక కుట్ర పూరిత చర్యలు ఉన్నాయని భావిస్తున్నట్టు చెప్పారు. తాను స్వయంగా మూడు గంటల పాటు కార్యాలయంలో కలియదిరిగి పరిస్థితిని పరిశీలించినట్టు తెలిపారు. అయితే.. షార్ట్ సర్క్యూట్ జరగడానికి.. అవకాశం లేదని గుర్తించినట్టు తెలిపారు. ఈ ఘటన వెనుక ఎవరున్నారనే విషయంపై విచారణ చేస్తామన్నారు. ఈ ఘటన వెనుక ఉద్దేశ పూర్వక చర్యలు ఉన్నాయని చెప్పారు.
ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం ఘటన చోటు చేసుకుందని డీజీపీ తెలిపారు. ఈ విషయం ఆర్డీవోకు తెలుసునని, అయితే.. ఆయన కలెక్టర్‌కు సమాచారం ఇవ్వలేదన్నారు. ఇదేసమయంలో పోలీసులు కూడా ఈవిషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని తెలిపారు. సీఐకి.. అగ్ని ప్రమాద ఘటన విషయం తెలిసిన తర్వాత కూడా.. డీఎస్పీకి, ఎస్పీకి సమాచారం ఇవ్వలేదన్నారు. శాఖ పరమైన విచారణ కూడా చేయనున్నట్టు డీజీపీ తిరుమల రావు తెలిపారు. ప్రాధమిక సమాచారం ప్రకారం ఆర్డీవో సెక్షన్‌లోని కీలకమైన విభాగంలో మంటలు రేగాయన్నారు.
ఈ మంటలు ప్రమాదవ శాత్తు సంభవించినవి కావని డీజీపీ చెప్పారు. వీటి వెనుక ఏం జరిగిందనే విషయం పరిశీలిస్తామన్నారు. విద్యుత్ శాఖ కూడా.. షార్ట్ సర్క్యూట్‌తో జరిగింది కాదని ధ్రువీకరించినట్టు తెలిపారు. 25 అంశాలకు సంబందించిన ఫైళ్లు దగ్ధమయ్యాయని చెప్పారు. వీటిలో కీలకమైన భూముల ఫైళ్లు ఉన్నాయని అధికారులు తెలిపారని చెప్పారు. ఆఫీసుకు కొద్దిపాటి దూరంలోనే ఈ పైళ్లు కాలుతున్నట్టు తాను కూడా గుర్తించినట్టు తెలిపారు. అన్ని కోణాల్లోనూ ఈ ఘటనపై విచారణ జరుపుతామని తెలిపారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు చాలా సీరియస్‌గా ఉన్నారని చెప్పారు.
వారిపై అనుమానం!
ఆర్డీవో ఆఫీసులో పనిచేస్తున్న కొందరిపై అనుమానాలు ఉన్నాయని డీజీపీ తెలిపారు. ఆదివారం అయినప్పటికీ.. కొందరు రాత్రి 10 గంటల తర్వాత కూడా పనులు చేసినట్టు సమాచారం ఉందన్నారు. అదేవిధంగా ఆఫీసుకు బయట అగ్గిపుల్లలు కూడా లభించాయని తెలిపారు. ఆ పక్కన కొంత దూరంలోనే ఫైళ్లు కాలుతున్నాయని గుర్తించినట్టు చెప్పారు.