వైసీపీ హవాను తట్టుకుని నిలిచిన విశాఖ నగరం నుంచి మరో టీడీపీ ఎమ్మెల్యే జగన్ పార్టీలో చేరబోతున్నారని తెలుస్తోంది. ఇప్పటికే విశాఖ సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్ వైసీపీ తీర్థం పుచ్చుకోగా ఇప్పుడు విశాఖ వెస్ట్ ఎమ్మెల్యే గణబాబు కూడా టీడీపీని వీడుతారని వినిపిస్తోంది. అయితే, ఇదంతా వైసీపీ చేస్తున్న ప్రచారమే తప్ప తమ నాయకుడు టీడీపీని వీడే ప్రసక్తే లేదని ఆయన అనుచరులు అంటున్నారు. కానీ, వైసీపీలో చేరే వరకు వాసుపల్లి గణేశ్ కూడా అలాగే అన్నారని.. ఇప్పుడు గణబాబు అనుచర గణం కూడా అదే పాట పాడుతున్నా చివరికి ఆయన చేరిక తప్పదని విశాఖ రాజకీయవర్గాల్లో వినిపిస్తోంది.
గణబాబు 2014, 2019లలో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆయన తండ్రి అప్పలనరసింహం కూడా రాజకీయ నాయకుడే. 1984లో అనకాపల్లి ఎంపీగా గెలిచిన ఆయన 1989లో కొణతాల రామకృష్ణ చేతిలో ఓడిపోయారు. గణబాబు రాజకీయ ప్రస్థానం కూడా ఓటమితోనే మొదలైనా ఆ తరువాత వరుస విజయాలతో విశాఖ వెస్ట్ నియోజవర్గంలో పట్టు సాధించారు.
దీంతో ఇప్పుడు ఆయన వైసీపీలో చేరడానికి ఆ పార్టీ పెద్దలతో మాట్లాడుకున్నప్పటికీ ఆ పార్టీలోనే విశాఖ వెస్ట్ నేతలు గణబాబు రాకపై అభ్యంతరం వ్యక్తంచేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మళ్ల విజయప్రసాద్ నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తమవుతుండడంతో ఆయన్ను బుజ్జగించాక గణబాబును చేర్చుకునేందుకు విజయసాయిరెడ్డి ప్రయత్నాలు చేస్తున్నట్లు చెబుతున్నారు.
ఎల్జీ పాలిమర్స్ ప్రమాదం తరువాత అక్కడి స్థానిక ఎమ్మెల్యేగా గణబాబు తమకు పెద్దగా ఇబ్బందులు కలిగించకపోవడంతో వైసీపీ నాయకత్వం కూడా ఆయన పట్ల సానుకూలంగా ఉందని.. ఇప్పుడు పార్టీలోకి తీసుకున్న విశాఖ రాజధానికి అనుకూలంగా కూడా ఆయన్ను వాడుకునే ఆలోచనతో పార్టీలోకి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. గణబాబు చేరికకు కూడా త్వరలో ముహూర్తం కుదురుతుందని… ఈ నెల చివర్లో ఆయన చేరిక ఉండొచ్చని తెలుస్తోంది.