టీడీపీ డ్ర‌స్ కోడ్‌.. అసెంబ్లీకి అలానే రావాల‌ని పిలుపు!

సోమవారం నుంచి ప్రారంభం అవుతున్న అసెంబ్లీ స‌మావేశాల్లో కూట‌మి స‌ర్కారు ఆస‌క్తికర నిర్ణ‌యం తీసుకుంది. ముఖ్యంగా తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యేల‌కు.. ఆ పార్టీ నేత‌లు కొన్ని కీల‌క సూచ‌న‌లు చేశారు. స‌భ‌కు వ‌చ్చే వారు.. ప‌సుపు రంగు దుస్తుల్లోనే రావాల‌ని పేర్కొన్నారు. అదేవిధంగా సైకిల్ గుర్తు మాత్ర‌మే ఉన్న ప‌సుపు కండువాలు ధ‌రించాల‌ని సూచించారు.

సూచ‌న‌ల‌ను త‌ప్ప‌కుండా పాటించాల‌ని అధిష్టానం నుంచి ఆదేశాలు వ‌చ్చాయ‌ని మాత్రం పార్టీ నాయ‌కులు పేర్కొన్నారు. ప్ర‌స్తుతం స‌భ‌లో 164 మంది ఎమ్మెల్యేలు.. కూట‌మి ప‌క్షాన ఉన్నారు. వీరిలో 135 మంది అచ్చంగా తెలుగు దేశం పార్టీ స‌భ్యులే. మిగిలిన‌వారిలో 21 మంది జ‌న‌సేన‌, 8 మంది బీజేపీ స‌భ్యులు ఉన్నారు. అయితే.. టీడీపీ స‌భ్యుల‌ను డ్ర‌స్ కోడ్ ఎందుకు పాటించ‌మ‌న్నార‌నేది తెలియ‌రాలేదు. కానీ, స‌భ‌లో త‌మ వారి సంఖ్య‌ను ప్ర‌తిబింబించాల‌నే లెక్క‌తోనే ఇలా చెప్పి ఉంటార‌ని తెలుస్తోంది.

గ‌తంలోనూ ఒక‌రిద్ద‌రు పార్టీ రంగుతో కూడిన ష‌ర్టులు వేసుకుని వ‌చ్చేవారు. అయితే.. అప్ప‌ట్లో జెండా రంగును పోలి ఉందంటూ కొంత అభ్యంత‌రం వ్య‌క్త‌మైంది. దీంతో మెడ‌లో ఉన్న కండువాల‌ను బ‌య‌ట వ‌దిలేసేవారు. అయితే.. ఇప్పుడు మాత్రం మెడ‌లో కూడా.. ప‌సుపు కండువా ధ‌రించి రావాల‌ని పార్టీ ఆదేశించింది. కానీ, అన్న ఎన్టీఆర్ కానీ, చంద్ర‌బాబు ఫొటోల‌ను కానీ.. పెట్టుకుని రావొద్ద‌ని కేవ‌లం సైకిల్ గుర్తుతో ఉన్న కండువాల‌ను మాత్ర‌మే ధ‌రించి రావాల‌ని సూచించ‌డం గ‌మ‌నార్హం.

ఇక‌, జ‌న‌సేన త‌ర‌ఫున ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి డ్ర‌స్ కోడ్ ఉత్త‌ర్వులు రాలేదు. అయితే.. కూటమి మిత్ర ప‌క్షం త‌మ పార్టీ జెండా రంగును పోలిన చొక్కాలు ధ‌రించి రావాల‌ని పేర్కొన్న ద‌రిమిలా.. జ‌న‌సేన కూడా అదే ప‌నిచేయొచ్చు. ఇక‌, బీజేపీ నాయ‌కులు ఇప్ప‌టికే కాషాయ కండువాల‌తో స‌భ‌కు రావ‌డం తెలిసిందే.