అధికారంలో ఉండగా ఎక్కడ లేని దర్పం చూపించారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కానీ అధికారం పోగానే ఆయన గాలి తీసిన బెలూన్ లాగా తయారయ్యారు. పార్టీ పరిస్థితి రోజు రోజుకూ ఇబ్బందికరంగా తయారవుతోంది. అంత అధికారం అనుభవించాక జగన్ ఈ వైఫల్యాన్ని ఏమాత్రం జీర్ణించుకోలేనట్లే కనిపిస్తున్నారు.
ఇంత ఘోరమైన ఫలితాల తర్వాత తీరు మార్చుకోకుండా పాత శైలినే కొనసాగిస్తూ ఆయన విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఇది చాలదన్నట్లు ఆయన ఏం చేసినా అదొక ట్రోల్ మెటీరియల్‌గా మారిపోతుండడం గమనార్హం.
కొన్ని రోజుల విరామం తర్వాత బయటికి వచ్చిన జగన్.. పల్నాడు ప్రాంతంలోని వినుకొండలో రషీద్ అనే వైసీపీ కార్యకర్త హత్యకు గురైన నేపథ్యంలో తన కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లారు. వెళ్లిన చోట నవ్వుతూ కనిపించడంతో చావు ఇళ్లకు వెళ్లిన ప్రతిసారీ ఇలా నవ్వడమేంటి అంటూ ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. జగన్ గతంలోనూ ఇలా చేయడం గమనార్హం.
అలాగే కుటుంబాన్ని పరామర్శించడం పోయి ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం మాట తప్పిన హామీల గురించి మాట్లాడ్డం.. తమ ప్రభుత్వం గొప్పదనాన్ని వివరించే ప్రయత్నం చేయడం విమర్శలకు దారి తీసింది. పుట్టెడు దుఃఖంలో ఉన్న కుటుంబాన్ని పరామర్శించే చోట ప్రభుత్వ హామీల గురించి మాట్లాడ్డమేంటి.. జగన్‌కు స్క్రీప్ట్ పేపర్ ఏమైనా మారిపోయిందా అంటూ జగన్ మీద ట్రోల్స్ మొదలయ్యాయి.
మరోవైపు మీడియాతో మాట్లాడుతున్నపుడు కూడా పేపర్ చూసి చూసి ఒక్కో మాట చెప్పడం.. మధ్యలో విలేకరి ఏదో ప్రశ్న వేస్తే మైండ్ బ్లాంక్ అయినట్లు మాట్లాడ్డం.. చివర్లో అంబటి రాంబాబు ఫలానా విషయం మీద మాట్లాడమని పక్కనుంచి చెబుతున్నా ఇక తన వల్ల కాదన్నట్లు వెళ్లిపోవడం ఇవన్నీ కూడా విమర్శలకు కారణమయ్యాయి.
స్క్రిప్టు లేకుంటే జగన్ ఏమీ మాట్లాడలేడంటూ నెటిజన్లు ఆయన మీద కౌంటర్లు వేస్తున్నారు. మరోవైపు చనిపోయింది తమ కార్యకర్త అని చెప్పుకుంటున్నజగన్.. అతడి కుటుంబానికి పార్టీ పరిహారం ప్రకటించకపోవడం కూడా విమర్శలకు దారి తీసింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates