ఎంపీడీవో కుటుంబానికి బాబు ఫోన్‌.. ఎవ‌రాయ‌న‌? ఏం జ‌రిగింది?

ఎంపీడీవో…మండ‌ల ప‌రిష‌త్ డెవ‌ల‌ప్ మెంట్ అధికారి. వాస్త‌వానికి ప్ర‌భుత్వ శాఖ‌ల ప‌రంగా చూస్తే.. ఇది చిన్న ఉద్యోగం. మ‌రి అలాంటి ఎంపీడీవో కుటుంబానికి ఏకంగా.. ఎంతో బిజీగా ఉన్న సీఎం చంద్ర‌బాబు ఫోన్ చేశారు. ఆయ‌న కుటుంబాన్ని ఓదార్చారు. ఇది అసాధార‌ణం. మ‌రి ఏం జ‌రిగింది? ఎవ‌రా ఎంపీడీవో! ఇదీ.. ఇప్పుడు అంద‌రినీ ఆస‌క్తిగా చ‌ర్చించుకునేలా చేసింది. నిజానికి ఎంపీడీవో వ్య‌వ‌హారం రెండు రోజులుగా వార్త‌ల్లో వ‌చ్చినా.. ఎవ‌రూ పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. కానీ.. సీఎం చంద్ర‌బాబు జోక్యంతో దీనిపై ఫోక‌స్ పెరిగింది.

ఎవ‌రీ ఎంపీడీవో..

ఉమ్మ‌డి ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలోని న‌ర‌సాపురం మండ‌ల ప‌రిష‌త్‌లో ఎంపీడీవోగా ప‌నిచేస్తున్న వెంక‌ట ర‌మ‌ణ‌.. 4 రోజుల నుంచి క‌నిపించ‌కుండా పోయారు. వైసీపీ హ‌యాంలో ఆ పార్టీ నేత‌ల ఒత్తిళ్ల మేర‌కు మండ‌ల‌ప‌రిష‌త్‌లో కొంద‌రు అధికారులు త‌ప్పుల‌పై త‌ప్పులు చేశారు. ఆ విష‌యాలు తెలిసినా.. అప్ప‌ట్లో వెంక‌ట ర‌మ‌ణ జోక్యం చేసుకునేందుకు భ‌య‌ప‌డి మౌనంగా ఉండిపోయారు. కానీ, తాజాగా ప్ర‌భుత్వం మార‌డంతో ఆయా అక్ర‌మాల‌పై అన్వేష‌ణ్ ప్రారంభ‌మైంది. దీంతో వైసీపీ నేత‌ల నుంచి నిజాలు చెబితే.. ప‌రిణామాలు తీవ్రంగా ఉంటాయంటూ.. వెంక‌ట‌ర‌మ‌ణ‌పై ఒత్తిడి వ‌చ్చింద‌ని ఆయ‌న కుటుంబ స‌భ్యులు చెబుతున్నారు.

ఇదిలావుంటే.. నాలుగు రోజుల కింద‌ట‌.. వెంక‌ట ర‌మ‌ణ‌.. న‌ర‌సాపురం నుంచి విజ‌య‌వాడ కు వ‌చ్చే రైలు ఎక్కి.. విజ‌య‌వాడ స‌మీపంలోని మ‌ధురాన‌గ‌ర్ వ‌ర‌కు చేరుకున్నారు. అక్క‌డ రైలు దిగి.. రైవ‌స్ కాలువ వ‌ర‌కు.. న‌డిచి వ‌చ్చార‌ని పోలీసులు తెలిపారు. త‌ర్వాత‌.. ఆయ‌న ఆచూకీ క‌నిపించ‌లేదు. అయితే.. ఆయ‌న కాల్వ‌లో దూకి మ‌ర‌ణించి.. ఉంటార‌ని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ గాలింపు చ‌ర్య‌లు కొన‌సాగుతున్నాయి. దీంతో వెంక‌ట‌ర‌మ‌ణ కుటుంబంలో తీవ్ర అల‌జ‌డి రేగి.. క‌న్నీరు మున్నీరుగా విల‌పిస్తున్నారు.

చంద్ర‌బాబు స్పంద‌న‌..

4 రోజుల నుంచి ఆచూకీ లేకుండా పోయిన నర్సాపురం ఎంపీడీఓ వెంకట‌ రమణారావు కుటుంబ సభ్యులతో సీఎం చంద్రబాబు నాయడు ఫోన్ లో మాట్లాడారు. రమణారావు చివరిగా ఇంటి నుంచి వెళ్లేటప్పుడు ఏం చెప్పారు…ఆయన ఒత్తడికి గురవ‌డానికి గల కారణాలు ఏంటని సీఎం అడిగి తెలుసు కున్నారు. కొద్ది రోజులుగా వెంకటరమణారావు తీవ్ర ఒత్తిడితో ఉన్నారని.. ఆఫీసులో ఏదో జ‌రిగింద‌నే కార‌ణంగా ఉద్యోగ సంబంధిత విషయాల్లో ఇబ్బంది పడ్డారని ఆయన సతీమణి సునీత తెలిపారు.

ఆమెతో పాటు, కుమారుడు సాయిరాంతో సీఎం ఫోన్ లో మాట్లాడారు. గతంలో ఎప్పుడైనా ఏవైనా అంశాలు మీ దృష్టికి తెచ్చారా అని సీఎం అడిగారు. ఘటనపై పూర్తి దర్యాప్తు చేస్తామని సీఎం అన్నారు. నిజాయితీ పరుడు, సమర్థుడైన అధికారి ఆచూకీ లేకుండా పోవడంపై ముఖ్యమంత్రి విచారం వ్యక్తం చేశారు. వెంకట రమణారావు కుటుంబాన్ని ఆదుకుంటామని, ఘటనపై పూర్తి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చారు. దీంతో ఈ వ్య‌వ‌హారం.. ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారింది. మ‌రి చివ‌ర‌కు సుఖాంతం అవుతుందో లేదో చూడాలి.