రమేష్ ఆసుపత్రి యాజమాన్యం డాక్టర్ పోతిన రమేష్ విచారణ వ్యవహారం కీలక మలుపులు తిరుగుతోంది. నేరుగా తాను విచారణకు హాజరుకాలేనని చెప్పిన డాక్టర్ పోతిన రమేష్ కావాలంటే వీడియో విచారణకు హాజరవుతానంటూ పోలీసులకు బంపర్ ఆఫర్ ఇచ్చారు. విజయవాడలోని స్వర్ణాప్యాలెస్ కోవిడ్ సెంటర్లో జరిగిన అగ్నిప్రమాదంలో 11మంది మరణించిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదానికి సంబంధించి బాధ్యులపై విచారణ జరిపేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఇందులో భాగంగా కొందరిని ఇప్పటికే విచారించగా ఆసుపత్రి ఛైర్మన్ పోతిన రమేష్ మాత్రం అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు.
ఇదే సమయంలో తనపై ఎటువంటి విచారణ జరగకుండా, చర్యలు తీసుకోకుండా హైకోర్టులో స్టే కూడా తెచ్చుకున్నారు. రమేష్ ఆచూకీ చెప్పినవారికి పోలీసులు లక్ష రూపాయల బహుమతి ప్రకటించినా కూడా డాక్టర్ ఆచూకి దొరకలేదు. అజ్ఞాతంలో ఉంటూనే కోర్టు నుండి స్టే తెచ్చుకున్న రమేష్ తీరుపై ప్రభుత్వం సుప్రింకోర్టుకెళ్ళింది. సుప్రిం విచారణలో రమేష్ ను విచారణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే అరెస్టు మాత్రం చేయద్దని స్పష్టంగా చెప్పింది. ఇదే సమయంలో విచారణలో పోలీసులకు సహకరించాలని రమేష్ ను కూడా ఆదేశించింది. సుప్రింకోర్టు తాజా ఆదేశాల ప్రకారం రమేష్ ను విచారణకు హాజరవ్వాలంటూ పోలీసులు నోటీసులిచ్చారు. దానికి రమేష్ ఇచ్చిన సమాధానం పోలీసులకు షాక్ కొట్టినట్లయ్యింది.
ఇంతకీ అందులో ఏముందంటే కరోనా వైరస్ కారణంగా తాను వ్యక్తిగతంగా విచారణకు హాజరుకాలేనంటూ డాక్టర్ చెప్పేశారు. తనకు వైరస్ సోకే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తంచేశారు. పోలీసుస్టేషన్ అంటే పబ్లిక్ ప్లేస్ కాబట్టి వచ్చేపోయే వారిలో ఎవరి ద్వారా అయినా తనకు కరోనా సోకే ప్రమాదం ఉందికాబట్టి తాను రాలేనంటూ సమాధానమిచ్చారు. అయితే విచారణను వీడియా కాన్ఫరెన్సు ద్వారా చేయాలని పోలీసులు అనుకుంటే హాజరవ్వటానికి తనకు అభ్యంతరం ఏమీ లేదంటూ చెప్పటమే విచిత్రంగా ఉంది. విచారణలో సహకరించాలని కోర్టు ఆదేశించినా పోలీసుల నుండి తప్పించుకుని తిరుగుతున్న డాక్టర్ విషయం ఎప్పటికి తేలుతుందో ఏమో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates