జగన్ ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రి మాత్రమే కాదు.. చాలా రాష్ట్రంలో ఒక పార్టీవారికి, పార్టీలతో సంబంధం లేకుండా కొందరు యువతకు, కొన్ని కులాలకు, కొన్ని మతాలవారి ఆరాధ్య దైవం. అలాంటి ఆరాధ్య దైవం ఏం చేసినా అనుచరులు, అభిమానులకు అది వేదవాక్కు. మరి, ఆ స్థాయి ఇన్‌ఫ్లూయెన్సర్ ఎంత జాగ్రత్తగా ఉండాలి.. బయట ఎక్కడ కనిపించినా తన అలవాట్లు, తీరు, నడవడిక అన్నీ మిగతావారికి స్ఫూర్తిదాయకంగా ఉండేలా చూసుకోవాలి.
అన్ని విషయాల్లో జడ్జ్ చేయలేం కానీ ఓ విషయంలో మాత్రం ఆయన ఎందుకో తన అభిమానులకే కాదు రాష్ట్ర ప్రజలకూ రాంగ్ మెసేజ్ ఇస్తున్నారు. అవును.. ఇంకా చెప్పాలంటే ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు కూడా.
లాక్‌డౌన్ మొదలైంది మొదలు.. దేశం కరోనా వైరస్‌ను సీరియస్‌గా తీసుకున్నది మొదలు ఇప్పటివరకు దేశంలో మూతి మీద మాస్కు లేకుండా ఎవరూ కనిపించడం లేదు. ఒక్క జగన్ తప్ప. మధ్యలో మోదీ సాబ్ ఇండైరెక్టుగా క్లాస్ పీకిన తరువాత ఒకసారి మాస్క్‌లో కనిపించారు జగన్. అంతే, ఆ తరువాత మళ్లీ ఆయన మాస్కుతో కనిపించలేదు.
‘నిజమే.. జగన్ మాస్క్ వేసుకోరు.. ఏదైనా ఓపెన్‌గా చేస్తారు. అది రాజకీయమైనా, ఇంకేదైనా’ అంటూ ఆయన్ను విమర్శించేవారు సెటైర్లు కూడా వేస్తున్నారు. అది వేరే విషయం అనుకోండి. ఇప్పుడు అసలు విషయానికొస్తే.. ఇంతకాలం తాను మాత్రమే మాస్కు పెట్టుకోని జగన్ ఇప్పుడు తన చుట్టూ ఉన్నవారిని కూడా పెట్టుకోనివ్వడం లేదు. బుధవారం ఆయన తిరుమల వెళ్లినప్పుడు చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. సోషల్ మీడియాలో తిరుగుతున్న ఒక వీడియోలో జగన్ తన చుట్టూ ఉన్నవారిని మాస్కు తీసేయమని చెప్పడం కనిపిస్తోంది.
తిరుమల వచ్చిన జగన్‌ను కలిసేందుకు ఆ(చిత్తూరు) జిల్లాకు చెందిన కాళహస్తి ఎమ్మెల్యే మధుసూదన్ వచ్చారు. కొద్దిరోజుల కిందటే కరోనా బారిన పడి కోలుకున్న ఆయన మాస్కు పెట్టుకుని జగన్ వద్దకు వచ్చారు. కానీ, జగన్ మాత్రం మాస్కు తీసేయమన్నట్లుగా ఆయనకు చెప్పడం ఆ వీడియోలో కనిపించింది. నాయకుడు చెప్పాక వినక తప్పుతుందా.. ఆయన నవ్వుతూ మాస్కు తొలగించారు.
అదన్న మాట సంగతి.. ఇంతకాలం తాను మాత్రమే మాస్కు పెట్టుకోని జగన్ ఇప్పుడు మిగతావారినీ వద్దని చెప్పడం ద్వారా మాస్కు గీస్కూ అవసరం లేదని రాష్ట్ర ప్రజలకు చెప్పినట్లయింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates