ఆంధ్రప్రదేవ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు కూడా అక్కడక్కడా కొంచెం హద్దుదాటి ప్రవర్తిస్తున్నారనే ఆరోపణలు లేకపోలేదు. ఇలాగే కొనసాగితే వైసీపీకి.. ఈ రెండు పార్టీలకు తేడా ఏంటి అనే ప్రశ్న ప్రజల్లో ఉత్పన్నం అవుతుందని.. కాబట్టి ఆ పార్టీల అధినేతలు జోక్యం చేసుకుని, హద్దులు దాటి ప్రవర్తించే వారిని అదుపు చేయాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. తాజాగా జరిగిన పార్టీ క్రియాశీల సమావేశంలో తన పార్టీ నేతలకు సుతి మెత్తగా హెచ్చరికలు జారీ చేశారు.
రౌడీయిజాన్ని తాను అస్సలు సహించబోనని.. అలా ప్రవర్తించే వారిని పక్కన పెట్టడానికి వెనుకాడనని పవన్ ఈ సందర్భంగా తేల్చి చెప్పారు. అంతే కాక వారసత్వ రాజకీయాలు చేయాలనుకునే వారికి ఆయన వార్నింగ్ ఇచ్చారు.
తాను ఎవరి గురించి మాట్లాడుతున్నానో వాళ్లకు తెలుసని పేర్కొంటూ.. కొందరు నాయకులు రౌడీయిజం చేస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని.. బయటే కాకుండా పార్టీలో ఉన్న చిన్న వారి మీద జులం చూపించడానికి వాళ్లు ప్రయత్నిస్తున్నారని.. అలాంటి వ్యక్తులు తనకు సన్నిహితులైనా, తన వద్ద చాలా ఏళ్లుగా నమ్మకంగా ఉన్నా సరే.. తమ తీరు మార్చుకోకుంటే పక్కన పెట్టడానికి ఏమాత్రం సందేహించనని పవన్ హెచ్చరించాడు. రౌడీ రాజకీయం జనసేనలో చెల్లదని పవన్ తేల్చి చెప్పాడు. అలాగే వారసత్వ రాజకీయాలు చేయాలనునేవారు కూడా జాగ్రత్తగా ఉండాలని పవన్ అన్నాడు.
తాను పట్టుదల వస్తే సొంత రక్తాన్ని కూడా పక్కన పెడతానని.. ఎప్పుడూ మన పిల్లలే ఎదగాలని చూడకూడదని.. అలా చేస్తే కొత్తదనం ఎక్కడి నుంచి వస్తుందని పవన్ చెప్పాడు. క్రమశిక్షణా రాహిత్యాన్ని తాను సహించనని పవన్ అన్నాడు. రాజకీయాల్లో తండ్రి వారసత్వాన్ని పిల్లలు కొనసాగిస్తే తప్పులేదని.. కానీ అది సహజ పద్ధతిలో జరగాలని.. కష్టపడి ఎదగాలి తప్ప బలవంతంగా జనం మీద, పార్టీ మీద వారసులను రుద్దాలని చూడకూడదని పవన్ అన్నాడు. తాము లేకపోతే పార్టీ గెలుపు కష్టం అని కొందరు అనుకుంటూ ఉండొచ్చని.. కానీ తాను దెబ్బ తినడానికి కూడా సిద్ధం తప్ప రాజీ పడనని పవన్ తేల్చి చెప్పాడు.