గడిచిన కొద్దిరోజులుగా తిరుమల శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించేందుకు వస్తున్న సీఎం జగన్.. డిక్లరేషన్ ఇవ్వాలన్న అంశంపై సాగుతున్న రచ్చ గురించి తెలిసిందే.
అన్య మతస్తుడైన ముఖ్యమంత్రి శ్రీవారి దర్శనానికి వెళ్లే ముందు.. డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదనటమే కాదు.. అసలు ఏ గుడిలో కూడా లేని డిక్లరేషన్ వ్యవహారం తిరుమలలో ఎందుకు ఉంటుంది? అంటూ ప్రశ్నించటమే కాదు.. ఈ ఇష్యూ మీద తరచూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొడాలి నాని తాజాగా మరింత ఘాటుగా రియాక్టు అయ్యారు.
డిక్లరేషన్ అంశంపై తాను చేసిన వ్యాఖ్యలపై ఏపీ బీజేపీ నేతలు మండిపడిన నేపథ్యంలో ఆయన గురి ఈసారి ఏకంగా ప్రధాని మీదకు వెళ్లింది. తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దర్శనానికి వచ్చే ప్రధాని సతీ సమేతంగా ఆలయానికి రావాలన్నారు. ఈ విషయాన్ని బీజేపీ నేతలు ప్రధాని మోడీకి చెప్పాలన్న మాటను చెప్పేశారు. అంతేకాదు.. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు పదవిని చేపట్టిన తర్వాతే ఏపీలోని ఆలయాలపై దాడులు పెరిగినట్లుగా ఆరోపించారు.
స్వామి వారి మీద నమ్మకంతోనే భక్తులు తిరుమలకు వస్తున్నారని.. దర్శనం సమయంలో డిక్లరేషన్ సమర్పించాల్సిన అవసరం లేదన్నది తన వ్యక్తిగత అభిప్రాయంగా వెల్లడించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మతంతో సంబంధం లేదని.. ఆయన గుడికి వచ్చినప్పుడు హిందువులా.. చర్చికి వెళ్లినప్పుడు క్రైస్తవుడిగా.. మసీదుకు వెళ్లే వేళలో నవాబులా ఉంటారన్నారు.
తన రాజకీయాల కోసం తిరుమల శ్రీనివాసుడ్ని కూడా చంద్రబాబు లాగేస్తున్నారన్నారు. శ్రీవారి దయ వల్లనే జగన్ ముఖ్యమంత్రి అయ్యారని.. అలాంటి ఆయన పట్టువస్త్రాలు సమర్పించేందుకు వస్తున్నప్పుడు డిక్లరేషన్ ఎందుకు సమర్పించాలన్న ప్రశ్నను సంధించారు. అధినేత మనసు దోచుకునే తొందరలో.. ప్రధాని మోడీని ఇష్యూలోకి లాగేందుకు వెనుకాడని కొడాలి వారి వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates